జట్టు ప్రయోజనాలే ముఖ్యం
గంభీర్, సూర్యకుమార్ విజ్ఞప్తిని తిరస్కరించిన బీసీసీఐ
మెగా టోర్నీ సందర్భంగా కుటుంబ సభ్యుల అనుమతికి నిరాకరణ
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో ఆటగాళ్లకు బీసీసీఐ పెట్టిన కండిషన్స్‌ను సడలించాలని టీమిండియా మేనేజ్మెంట్ చేసిన విజ్ఞప్తికి బోర్డు నిరాకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మెగా టోర్నీ సందర్భంగా కుటుంబ సభ్యులను తమతో అనుమతించాలని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన రిక్వెస్ట్‌ను బీసీసీఐ తిరస్కరించింది. జట్టు ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది. గతేడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పరాజయం తర్వాత బీసీసీఐ ఆటగాళ్లకు 10 కండిషన్స్‌తో కూడిన గైడ్‌లైన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా విదేశీ పర్యటనలు, సిరీస్‌ల సందర్భంగా ఆటగాళ్లతో కుటుంబ సభ్యులు ఉండటాన్ని నిషేధించింది. 45 రోజులకంటే ఎక్కువ సాగే పర్యటనల్లోనే కుటుంబ సభ్యులను కేవలం 15 రోజులకు మాత్రమే అనుమతించింది. అయితే ఆటగాళ్లు తమ సొంత ఖర్చుతో కుటుంబ సభ్యుల ప్రయాణానికి, బసకు ఏర్పాట్లు చేసుకోవచ్చు. కానీ ఒకే హోటల్ గదిలో ఉండకూడదు.


