గ్యారెంటీ కార్డులు గాలికే…
ఇచ్చిన హామీలు నెరవేర్చాకే ఓట్లు అడగాలి
రెండున్నరేళ్లైనా పథకాల అమలు లేదు
కేసీఆర్ హయాంలోనే మధిరలో అసలైన అభివృద్ధి
ఎన్నికల వేళ కాంగ్రెస్ హడావుడి రాజకీయమే
కాంగ్రెస్‌పై మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఫైర్
మధిరలో గులాబీ ప్రచార హోరు
కాకతీయ, బోనకల్ : మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు మధిర పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు హోరెత్తించాయి. 4, 11, 12, 13, 14, 17, 18, 20, 21, 22 వార్డుల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మధిర అసెంబ్లీ ఇంచార్జి లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులతో కలిసి గులాబీ శ్రేణులు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మధిర ప్రజలను ఓట్లు అడగాలంటే ముందుగా భట్టి విక్రమార్క ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గ్యారెంటీ కార్డుల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, రెండున్నరేళ్లు గడిచినా వాటిలో ఒక్క హామీ కూడా అమలుకాలేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ హామీలపై నిలదీత
అసెంబ్లీ ఎన్నికల ముందు మూడు నెలల్లో హామీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలని నామ ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు. ఎన్నికలు రాగానే హడావుడిగా శంకుస్థాపనలు, నిధుల ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. రెండేళ్లు నిద్రపోయిన కాంగ్రెస్‌కు ఇప్పుడు మధిర అభివృద్ధి గుర్తుకొచ్చిందా? అని ఘాటుగా నిలదీశారు. ప్రజలు ఈ నాటకాలను గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి
మధిర పట్టణంలో జరిగిన అభివృద్ధి అంతా కేసీఆర్ పాలనలోనే జరిగిందని నామ స్పష్టం చేశారు. 100 పడకల ఆసుపత్రి, ట్యాంక్‌బండ్ నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సెంట్రల్ లైటింగ్, పార్కులు, డివైడర్లు వంటి అనేక పనులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయని గుర్తు చేశారు. తాగునీరు, సాగునీరు, విద్యుత్ సమస్యలు లేకుండా మధిరను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, వారి సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని నామ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలన – కాంగ్రెస్ పాలన మధ్య తేడాను ప్రజలు గమనించి, అభివృద్ధికి అండగా నిలవాలని కోరారు. మధిర ప్రజలు కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని, గులాబీ జెండాకు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


