పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అవసరం
కాలుష్య నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయాలి
పరిశోధన, శిక్షణలకు ప్రాధాన్యం
కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో పర్యావరణ శిక్షణ, పరిశోధన సంస్థ కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సూచించారు. శుక్రవారం డా.బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన సంస్థ పాలకమండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ పర్యావరణ మార్పులపై పరిశోధనలు, విద్యార్థులకు అవగాహన తరగతులు, శిక్షణా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జేఎన్‌టీయూ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం అమలవుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు, శిక్షణ కార్యక్రమాలు, మానవ వనరుల అభివృద్ధి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు అనుగుణంగా పర్యావరణ అనుకూల చర్యలు వేగవంతం చేయాలని, వివిధ శాఖలతో సమన్వయం పెంచాలని సూచించారు. పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, నీటి–వాయు కాలుష్య నియంత్రణ, పచ్చదనం పెంపకం వంటి అంశాల్లో సంస్థ మరింత చురుకైన పాత్ర పోషించాలని తెలిపారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పర్యావరణ పరిరక్షణ చర్యలను సమర్థంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బోజ్జా, పురపాలక పరిపాలన శాఖ కార్యదర్శి టి.కె. శ్రీదేవి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


