చేర్యాల పోరాటాలకు పురిటి గడ్డ
బీఆర్‌ఎస్ హయాంలో మహిళల నిధుల దోపిడీ
ఈ ఏడాదిలోనే చేర్యాలకు రూ.36 కోట్ల నిధులు
12 మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
చేర్యాలలో కాంగ్రెస్ జెండా ఎగురాలి : మంత్రి సీతక్క
పల్లా ఓ యామగాడు.. దొంగ ఓట్ల స్పెషలిస్టు
కాళేశ్వరం కాదు… కూలేశ్వరం అయ్యింది
భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి
కాకతీయ, చేర్యాల : మున్సిపల్ ఎన్నికల వేళ చేర్యాల పట్టణం రాజకీయ వేడితో దద్దరిల్లింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన భారీ ఎన్నికల ప్రచార ర్యాలీకి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై బీఆర్‌ఎస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ చేర్యాల ప్రాంతం చైతన్యానికి అడ్డగా, పోరాటాలకు పురిటి గడ్డగా చరిత్రలో నిలిచిందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో పావలా వడ్డీ పేరుతో మహిళల నుంచి రూ.3 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలోనే చేర్యాల అభివృద్ధికి రూ.36 కోట్ల నిధులు కేటాయించామని స్పష్టం చేశారు. మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరి ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలని మంత్రి సూచించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ధీమా వ్యక్తం చేశారు. మహిళా సంఘాల అభయహస్తం రుణాల పేరుతో రూ.200 కోట్లను కాజేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. చేర్యాల పట్టణం అభివృద్ధి చెందాలంటే మొత్తం 12 మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని మంత్రి పిలుపునిచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యంతో చేర్యాల ప్రాంతం తన అసిత్త్వాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న గ్రామపంచాయతీ నిధులను విడతల వారీగా రూ.500 కోట్లు విడుదల చేసి పంచాయతీలకు అందించామని తెలిపారు. మున్సిపాలిటీకి ఇప్పటికే రూ.15 కోట్ల నిధులు కేటాయించామని, అవసరమైన మేర మరిన్ని నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

“పల్లా ఓ మాయగాడు… దొంగ ఓట్ల స్పెషలిస్టు!”
ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రసంగంలో బీఆర్‌ఎస్ నాయకత్వంపై ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ కోసం 1300 మంది అమరవీరులు ప్రాణాలు అర్పిస్తే, నీళ్లు–నిధులు–నియామకాలు కేసీఆర్ కుటుంబానికే దక్కాయని మండిపడ్డారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట తప్పిన కేసీఆర్, చివరకు తన కుటుంబానికే పదవులు పంచుకున్నారని ఆరోపించారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రాజెక్టులు నేటికీ పటిష్టంగా ఉన్నాయని, కానీ కేసీఆర్ లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం నేడు “కూలేశ్వరం”గా మారిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓ జబర్దస్త్ యాక్టర్ అని, దొంగ ఓట్లతో, దొంగ దారుల్లో మ్యాజిక్‌లు చేసే మాయగాడని తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఓట్లతో పల్లాకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కష్టపడి ప్రజల మధ్య నుంచి ఎదిగిన నాయకుడు రేవంత్ రెడ్డి అయితే, అమెరికా నుంచి వచ్చి సిరిసిల్ల సీటు దక్కించుకున్న నేత కేటీఆర్ అని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతానికి రావాల్సిన సాగునీటిని సిద్ధిపేటకు మళ్లించి రైతులను మోసం చేసిన వ్యక్తి మాజీ మంత్రి హరీష్ రావు అని ఆరోపించారు.
అప్పుల రాష్ట్రంగా మారిన తెలంగాణ
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని చామల మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే చేర్యాల పట్టణానికి నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. చేర్యాల ప్రజలు ఈసారి ఆలోచించి ఓటేయాలని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి పట్టణాభివృద్ధికి బాటలు వేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జనగామ నియోజకవర్గ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


