అవినీతి బీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి
కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేయాలి
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపు
తిరుమలగిరి, మోత్కూర్ మున్సిపాలిటీల్లో ప్రచారం
కాకతీయ, తిరుమలగిరి/మోత్కూర్ : ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని, ప్రజలు వేసే ఓట్లతో అవినీతి బీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుమలగిరి, మోత్కూర్ మున్సిపాలిటీలపై ఈసారి కాంగ్రెస్ జెండానే ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి, మోత్కూర్ మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశాల్లో ఎంపీ చామల ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి బొజ్జు సంధ్య రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామెల్ ఆధ్వర్యంలో ఈ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఎంపీ మాట్లాడుతూ, అందరూ సమిష్టిగా కష్టపడి పనిచేస్తే రెండు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని తెలిపారు. ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణలో సాగుతున్న ప్రజాపాలనను ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల ద్వారా ప్రతి ఇంటికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ గెలుపుకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. టిక్కెట్లు దక్కని నాయకులు అసంతృప్తికి లోనుకాకుండా పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని ఆయన కోరారు. టిక్కెట్ రాని నాయకులకు అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కల్పించడంతో పాటు పార్టీ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అందరి ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఖరారు చేసి, తిరుమలగిరి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని ఎంపీ పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని, కష్టపడ్డ వారికి మంచి రోజులు రాబోతున్నాయని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని, విభేదాలు పక్కన పెట్టి పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


