కేసీఆర్‌ను విచారించనున్న సిట్
మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లో విచారణ ఆరంభం
ఎర్రవల్లి నుంచి భారీ కాన్వాయ్‌తో బయల్దేరిన కేసీఆర్
నివాసంలోని రెండో అంతస్తులోనే విచారణ
విచారణ సమయంలో గదిలో కేసీఆర్‌తో పాటు ఎవరికి అనుమతి లేదు
వీడియో రికార్డింగ్‌కు ఏర్పాట్లు
కాకతీయ, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి *కేసీఆర్*ను విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ఫిబ్రవరి 1, 2026 (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ముందుగా ఖరారు చేసిన ప్రకారం కేసీఆర్ నివాసంలోని రెండో అంతస్తులోనే సిట్ విచారణ కొనసాగనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి భారీ కాన్వాయ్‌తో నందినగర్ నివాసానికి బయల్దేరినట్లు తెలిసింది. భద్రతా ఏర్పాట్ల మధ్య ఆయన నివాసానికి చేరుకున్నారు. విచారణ సమయంలో ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా సిట్ అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. నందినగర్ నివాసంలోకి పార్టీ నేతలు, ఇతర సిబ్బందికి పూర్తిగా అనుమతి నిరాకరించారు. భద్రతా, గోప్యతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
కేసీఆర్‌కే మాత్రమే అనుమతి
సిట్ ఏర్పాటు చేసిన విచారణ గదిలోకి కేసీఆర్ ఒక్కరినే అనుమతించే అవకాశం ఉందని సమాచారం. విచారణ సమయంలో ఎవరూ లోపలికి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే కుటుంబ సభ్యులైన హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులకు మాత్రమే నివాసంలో ఉండేందుకు అనుమతి ఇచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. విచారణ మొత్తం పారదర్శకంగా సాగేందుకు ప్రతి దశను వీడియో రికార్డ్ చేయనున్నట్లు సిట్ వర్గాలు వెల్లడించాయి. ప్రశ్నలు, సమాధానాలు అన్నింటినీ రికార్డుల్లో భద్రపరచనున్నారు. భవిష్యత్ న్యాయపరమైన అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విచారణ నేపథ్యంలో నందినగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి నిరసనలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అంతకుముందు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో విచారణ జరపాలని కేసీఆర్ సూచించినప్పటికీ, సున్నితమైన ఎలక్ట్రానిక్ ఆధారాలను అక్కడికి తరలించడం కష్టమని సిట్ అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో నందినగర్ నివాసంలోనే విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. సిట్ విచారణ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ విచారణ ఎలాంటి మలుపు తిరుగుతుందన్న దానిపై రాజకీయంగా విస్తృత చర్చ కొనసాగుతోంది.


