చివరి రోజు నామినేషన్ల హోరు
కాకతీయ, రామకృష్ణాపూర్ : రెండో సాధారణ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులు,ఆశావహులు తమ నామినేషన్ పత్రాలను స్థానిక క్యాతన్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారి (రిటర్నింగ్ ఆఫీసర్) వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో దాఖలు చేశారు. శుక్రవారం చివరిరోజు కావడంతో నామినేషన్ల హోరు జోరందుకుంది. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు ఇంటిడిపెండెట్ (స్వతంత్ర) అభ్యర్థులు నామినేషన్లు వేశారు. బుధవారం ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఇప్పటి వరకు సుమారు 200 పై చిలుకు నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా నామినేషన్ల ప్రక్రియను ఆర్డీవో శ్రీనివాస రావు పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని ఆదేశాల మేరకు వచ్చిన నామినేషన్లను శనివారం (స్క్రూటినీ) పరిశీలన చేయనున్నట్లు చెప్పారు. అలాగే మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల లోపు నామినేషన్ ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉందన్నారు. అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రచూరించనున్నట్లు పేర్కొన్నారు. మందమర్రి సీఐ పర్ష రమేష్,పట్టణ ఎస్సై జే.శ్రీధర్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్,ఇతర విభాగాలకు చెందిన అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.


