ఖమ్మం బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్
మంత్రి తుమ్మల నాయకత్వానికి జై కొట్టిన మహిళా కార్పొరేటర్లు
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఐదుగురు కార్పోరేటర్లు
గాంధీ భవన్‌లో పీసీసీ అధ్యక్షుడి సమక్షంలో చేరిక
ఖమ్మంలో కాంగ్రెస్ బలం మరింత పెంపు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇస్తూ.. ఐదుగురు మహిళా కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వానికి జై కొడుతూ, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ సమక్షంలో హైదరాబాద్ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో 12వ డివిజన్ కార్పొరేటర్ చిరుమామిళ్ల లక్ష్మీ, 25వ డివిజన్ కార్పొరేటర్ గోళ్ల చంద్రకళ, 32వ డివిజన్ కార్పొరేటర్ డోనవన్ సరస్వతి, 40వ డివిజన్ కార్పొరేటర్ దాదే అమృతమ్మ, 55వ డివిజన్ కార్పొరేటర్ మోతారపు శ్రావణి ఉన్నారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ కార్పొరేటర్లకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తుమ్మల నాయకత్వంపై విశ్వాసం
పార్టీలో చేరిన కార్పొరేటర్లు మాట్లాడుతూ.. ఆధునిక ఖమ్మం రూపశిల్పిగా పేరొందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమర్థవంతమైన నాయకత్వంపై నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఖమ్మం నగరాన్ని అభివృద్ధి బాటలో నిలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నుంచి వరుసగా నేతలు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుండటంతో ఖమ్మం రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మహిళా కార్పొరేటర్ల చేరికతో నగరంలో కాంగ్రెస్ బలం మరింత పెరిగినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ పరిణామం మున్ముందు స్థానిక రాజకీయాలపై ప్రభావం చూపనుందన్న చర్చ సాగుతోంది.


