ఆయుర్వేద శస్త్రచికిత్సల భద్రమేనా..?
ఆందోళన వ్యక్తం చేస్తున్న అల్లోపతి వైద్యులు
అత్యవసర పరిస్థితులే అసలు పరీక్ష
ప్రాచీన ఆయుర్వేద వారసత్వాన్ని గుర్తుచేస్తున్న ప్రభుత్వం
గ్రామీణ వైద్య సేవలే లక్ష్యమంటున్న ఆయుష్ వర్గాలు
కేంద్రం అనుమతించడంపై భిన్న స్వరాలు
గ్రామీణ ప్రజలకు మేలు లక్ష్యమేనంటు కేంద్రం వివరణ
కాకతీయ, ప్రత్యేక ప్రతినిధి : ఆయుర్వేద వైద్యులు కొన్ని రకాల శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వైద్య రంగంలో చర్చ మొదలైంది. ఈ నిర్ణయం రోగుల భద్రతపై ప్రభావం చూపుతుందా అన్న అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఒకవైపు అల్లోపతి వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరోవైపు ప్రభుత్వం, ఆయుర్వేద నిపుణులు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. అల్లోపతి వైద్య నిపుణుల ప్రకారం, శస్త్రచికిత్స అనేది అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. ఎంబీబీఎస్ ఐదేళ్లు పూర్తిచేసిన తర్వాత మూడేళ్లపాటు ఎంఎస్ వంటి స్పెషలైజేషన్ ద్వారా వేల గంటల ప్రాక్టికల్ శిక్షణ పొందుతారని వారు గుర్తుచేస్తున్నారు. అదే స్థాయిలో లోతైన శిక్షణ ఆయుర్వేద పీజీ వైద్యులకు ఉండకపోవచ్చని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అత్యవసర పరిస్థితులే అసలు పరీక్ష
శస్త్రచికిత్స సమయంలో అనస్థీషియా రియాక్షన్, తీవ్రమైన రక్తస్రావం వంటి అత్యవసర పరిస్థితులు తలెత్తే అవకాశముంటుందని వైద్యులు చెబుతున్నారు. అటువంటి సందర్భాల్లో ఆధునిక వైద్య నైపుణ్యం అవసరమవుతుందని, ఆయుర్వేద వైద్యులు వాటిని ఎంతవరకు సమర్థంగా ఎదుర్కోగలరన్నది పెద్ద ప్రశ్నగా మారిందని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఆయుర్వేదానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని స్పష్టం చేస్తోంది. శస్త్రచికిత్సలకు పితామహుడిగా భావించే సుశ్రుతుడు ఆయుర్వేద వైద్యుడేనని గుర్తుచేస్తోంది. ఆధునిక పరిజ్ఞానం, శిక్షణతో ఆయుర్వేద శస్త్రచికిత్సలు చేయడంలో తప్పేమీ లేదని వాదిస్తోంది.
గ్రామీణ ప్రజలకు మేలు లక్ష్యం
గ్రామీణ ప్రాంతాల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరత తీవ్రంగా ఉందని, అటువంటి పరిస్థితుల్లో శిక్షణ పొందిన ఆయుర్వేద వైద్యులు కీలక పాత్ర పోషించగలరని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని రకాల శస్త్రచికిత్సలకు కాకుండా, కేవలం 58 రకాల చిన్నపాటి శస్త్రచికిత్సలకు మాత్రమే అనుమతి ఇచ్చామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అల్లోపతి వైద్యులు మాత్రం ఆయుర్వేదం, అల్లోపతీ కలయిక వల్ల వైద్య విధానాల్లో స్పష్టత కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ‘మిక్సోపతీ’ వల్ల రోగుల ప్రాణాలే పణంగా మారే పరిస్థితి తలెత్తవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఆయుర్వేద శస్త్రచికిత్సల అనుమతిపై తుది ప్రభావం రోగుల భద్రతపైనే ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేద వైద్యులకు ఇచ్చే శిక్షణ నాణ్యత, ఆసుపత్రుల్లో ఉన్న అత్యవసర సదుపాయాలు కీలకమని నిపుణులు చెబుతున్నారు. రోగులు శస్త్రచికిత్సకు ముందు వైద్యుని అనుభవం, ఆసుపత్రి వసతులపై పూర్తి సమాచారం తెలుసుకోవడం అవసరమని సూచిస్తున్నారు.


