ప్రజల కోసం పనిచేయాలి
సుపరిపాలన అందించాలి
మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు–ఓటములు సహజమేనని, ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యల పరిష్కారానికే అంకితమై పనిచేస్తేనే ప్రజల ఆదరాభిమానాలు నిలుస్తాయని కొత్తగూడెం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ గ్రామాల్లో సుపరిపాలన అందించాలని ఆయన సూచించారు. బుధవారం చుంచుపల్లి మండలంలోని నంద తండా, భదావత్ తండాలకు చెందిన బీఆర్‌ఎస్ సర్పంచులు మాలోతు బలరాం, బాదావత్ శ్రీకాంత్‌లు వనమా వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన సర్పంచులు గ్రామాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని, పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలని హితవు పలికారు. ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు ఎండగట్టాలని, అదే సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. గ్రామ స్థాయిలో ప్రజల నమ్మకం సంపాదించాలంటే అందరికీ అందుబాటులో ఉంటూ, పారదర్శకంగా పాలన సాగించాలని అన్నారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములై పనిచేసే నాయకులకే భవిష్యత్తులో ప్రజల మద్దతు నిలుస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, బీఆర్‌ఎస్ నాయకులు మాలోత్ శ్రీరామ్‌తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతలు పాల్గొన్నారు.


