టీటీడీలో మరో కుంభకోణమా?
గోవిందరాజస్వామి గోపురం బంగారు తాపడంపై అనుమానాలు
విమాన గోపురం బంగారు తాపడంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు
100 కిలోల బంగారంలో సగం మాయమైందన్న ఫిర్యాదులు
9 పొరల బదులు 2 పొరలతోనే పనులు పూర్తి చేసినట్లు అభియోగం
టీటీడీ విజిలెన్స్ గోప్య విచారణ… జనసేన ఆందోళన
కాకతీయ, ఏపీ బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే కల్తీ నెయ్యి, పరకామణి చోరీ, వస్త్రాల కొనుగోళ్లలో అవకతవకలపై ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీటీడీపై ఇప్పుడు భక్తుల మనోభావాలకు సంబంధించిన మరో అంశం తెరపైకి వచ్చింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో భారీ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. 2022–23 మధ్యకాలంలో శ్రీ గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు చేపట్టేందుకు టీటీడీ నిర్ణయించింది. ఈ పనుల కోసం సుమారు 100 కిలోల బంగారాన్ని కేటాయించడంతో పాటు 4,300 కిలోల రాగిని వినియోగించాలని ప్రణాళిక రూపొందించింది. గోపురానికి 9 పొరల బంగారు తాపడం చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ, కేవలం 2 పొరలతోనే పనులు ముగించి దాదాపు 50 కిలోల బంగారాన్ని మాయం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పనుల కాంట్రాక్టును జ్యోతి అనే మహిళ దక్కించుకున్నట్లు సమాచారం. అయితే ఆమె స్వయంగా పనులు చేయకుండా ఇద్దరు సబ్‌కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించిందన్న అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో అన్యమతస్తులైన సయ్యద్ కరీం, రహంతుల్లాకు పనులు అప్పగించడంపై జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆలయ విమాన గోపురం వంటి పవిత్ర పనులను ఇలా సబ్‌లీజ్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తోంది.
విగ్రహాల ధ్వంసంపై ఆవేదన
బంగారు తాపడం పనుల సమయంలో గోపురంపై ఉన్న 30కి పైగా పురాతన దేవతా విగ్రహాలను ధ్వంసం చేసినట్లు అప్పట్లోనే ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశం భక్తుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. విగ్రహాల ధ్వంసం అనంతరమే తాపడం పనులు చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి.
విమాన గోపురం పనులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ విభాగం లోతైన విచారణ చేపట్టింది. అసలు కాంట్రాక్టర్, సబ్‌కాంట్రాక్టర్లు, పనులు చేసిన కార్మికులను విచారిస్తూ ఎంత బంగారం వినియోగించారన్న అంశంపై ఆరా తీస్తోంది. అయితే ఈ విచారణ అంతా అత్యంత గోప్యంగా సాగుతుండటంతో ఇప్పటివరకు టీటీడీ అధికారికంగా స్పందించలేదు.
జనసేన ఆరోపణలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో స్వామివారి ఆస్తులను స్వాహా చేశారంటూ జనసేన తీవ్ర ఆరోపణలు చేస్తోంది. టీటీడీ ఇచ్చిన 100 కిలోల బంగారంలో సగం మాయమైందని, బంగారం బదులు గోల్డ్ కలర్ పెయింట్ మాత్రమే వేశారని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిల పాత్ర ఉందని కూడా ఆయన ఆరోపించారు. బంగారు తాపడం పేరుతో వాడిన బంగారం నిజమైనదేనా అన్న అనుమానం వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. శ్రీవారికి అన్నగా భావించే గోవిందరాజస్వామి ఆలయానికి సంబంధించిన ఈ ఆరోపణలు భక్తుల్లో తీవ్ర కలవరం రేపుతున్నాయి. విజిలెన్స్ విచారణలో వాస్తవాలు బయటపడాలని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.


