గాంధీ పేరే బీజేపీకి భయం!
ఉపాధి హామీ నుంచి పేరు తొలగింపు అప్రజాస్వామికం
లౌకిక దేశంలో మోదీ–అమిత్ షాల పప్పులు ఉడకవు
రాజ్యాంగంపై కుట్రలు జరుగుతున్నాయి..
కేంద్రంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి
టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్
అధికారం ఉందని దుర్మార్గ నిర్ణయాలు : జూపల్లి కృష్ణారావు
కాకతీయ, హైదరాబాద్ : మహాత్మా గాంధీ పేరు పలికితే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ఉలుకే పరిస్థితి ఏర్పడుతుందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ ఆధ్వర్యంలో శనివారం ఎంజీ రోడ్డులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గాంధీ కుటుంబం పేరు వింటే బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. గాడ్సేను పూజించే వారు కావడంవల్లే గాంధీ పేరును తొలగించాలనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో చర్చించి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది సోనియా గాంధీయేనని గుర్తు చేశారు. పేదలకు ఏడాదికి 100 రోజుల ఉపాధి కల్పించిన ఈ పథకానికి 2014 తర్వాత బీజేపీ ప్రభుత్వం నిధులు కోత పెడుతూ వస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగించడం అప్రజాస్వామికమని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ పేరు ప్రజల హృదయాల నుంచి ఎవరూ చెరపలేరన్నారు.
రాజ్యాంగంపై కుట్రలు
రాజ్యాంగాన్ని మార్చే కుట్రలకు బీజేపీ తెరలేపిందని, మనుస్మృతి అమలు చేయాలనే పన్నాగం చేస్తోందని ఆరోపించారు. గాంధీ–నెహ్రూ వారసత్వాన్ని మరిపించాలనే ప్రయత్నాలు ఫలించవన్నారు. లౌకిక దేశంలో మోదీ, అమిత్ షాల పప్పులు ఉడకవని స్పష్టం చేశారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేసే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు కర్రకాల్చి వాత పెట్టారని వ్యాఖ్యానించారు.
అధికారం ఉందని దుర్మార్గపు నిర్ణయాలు : జూపల్లి కృష్ణారావు
అధికారం ఉందన్న అహంకారంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకుంటోందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. సికింద్రాబాద్ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ప్రతి భారతీయుని గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు. కరువు కాటకాలు, ఆర్థిక కష్టాల సమయంలో అట్టడుగు పేదలకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. కోట్లాది పేద కుటుంబాలకు ఉపాధి, గౌరవాన్ని కల్పించిన ఈ గొప్ప పథకాన్ని నేడు బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఉన్న రాజకీయ కక్షతోనే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి విరుద్ధమని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ఈ చట్టాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునే వరకు గ్రామాలు, ప్రజలు ఏకం కావాలని జూపల్లి పిలుపునిచ్చారు. అందరూ ఒక్కతాటిపైకి వచ్చి ఈ అన్యాయ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, మాజీ క్రికెటర్ అజారుద్దీన్, ఎమ్మెల్యే వెడమ బొజ్జు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


