12 అక్రమ ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం
అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు
తహసీల్దార్ చందా నరేష్
కాకతీయ, నెల్లికుదురు : నెల్లికుదురు మండలంలోని ఆకేరు వాగు పరిసర గ్రామాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 12 ట్రాక్టర్లను పట్టుకుని స్వాధీనం చేసుకున్నట్లు తహసిల్దార్ చందా నరేష్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, అక్రమ ఇసుక తవ్వకం, రవాణాపై వచ్చిన సమాచారం మేరకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లు పట్టుబడగా, వాటిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సహజ వనరుల అక్రమ దోపిడీని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేసిన తహసిల్దార్, అక్రమ ఇసుక రవాణాకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఆకేరు వాగు పరిసర ప్రాంతాల్లో ఇకపై కూడా నిరంతర తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. అక్రమ ఇసుక తవ్వకం, రవాణా విషయమై సమాచారం తెలిసిన వెంటనే రెవెన్యూ శాఖకు తెలియజేసి సహకరించాలని ప్రజలను ఆయన కోరారు.


