మీ భద్రతే మా లక్ష్యం
రోడ్డు భద్రత పాటిస్తేనే ప్రమాదాలకు చెక్
ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్
‘అరైవ్ అలైవ్’ రెండో విడత అవగాహన కార్యక్రమం ప్రారంభం
ఆటో డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం.. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పిలుపు
కాకతీయ, ఖమ్మం బ్యూరో: రోడ్డు భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తేనే ప్రమాదాలను అరికట్టగలమని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ రెండో విడత అవగాహన కార్యక్రమాలు కమిషనరేట్ పరిధిలో ప్రారంభమయ్యాయి. బుధవారం పోలీస్ ప్రధాన కార్యాలయంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిర్ణీత వేగ పరిమితి, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం తప్పనిసరి అన్నారు. మద్యం సేవించి డ్రైవింగ్, మొబైల్ ఉపయోగం, ప్రమాదకర ఓవర్‌టేక్‌లే ప్రమాదాలకు ప్రధాన కారణమని హెచ్చరించారు.
మానవ నిర్లక్ష్యమే ప్రమాదాలకు మూలం
జిల్లాలో నమోదవుతున్న ప్రమాదాల్లో అధిక శాతం మానవ నిర్లక్ష్యం వల్లేనని గణాంకాలు చెబుతున్నాయని వెల్లడించారు. గ్రామాలు, పట్టణాలు, జాతీయ రహదారులు, ప్రమాద ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రోడ్డు భద్రత పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ఇది ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు.


