11 తర్వాత మీ లెక్కలు తేలుస్తా!
రాజకీయ ముసుగులో అరాచకాలు సహించం
చందాలు, దందాలు చేస్తే కఠిన చర్యలు
బెదిరింపులకు దిగితే ఊరుకునేది లేదు
కారుకూతలు కూస్తే బొక్కలోకి పంపిస్తా
ఏదులాపురం ప్రచార ముగింపులో మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
కాకతీయ, కూసుమంచి : రాజకీయాల ముసుగులో అరాచకాలకు పాల్పడితే ఇక సహించేది లేదని, ఎన్నికలు ముగిసిన వెంటనే హద్దులు దాటిన ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తానని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర హెచ్చరికలు చేశారు. ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచార ముగింపు సందర్భంగా వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన ప్రత్యర్థులపై ఘాటుగా స్పందించారు. ఎవరైనా ఫోన్లలో బెదిరింపులకు దిగినా, రాజకీయాల పేరుతో దౌర్జన్యాలు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. “11వ తేదీ తర్వాత పరిస్థితి మారిపోతుంది. చందాలు, దందాలు చేస్తే కిందపడుద్ది జాగ్రత్త. తింగరి వేషాలు వేస్తే ఊరుకోం… నేరుగా బొక్కలోకి పంపిస్తాం” అని మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

దందాలకు ఇక కాలం చెల్లింది
ప్రచార సమయంలో ప్రత్యర్థులు చేస్తున్న బెదిరింపులపై మంత్రి మండిపడ్డారు. “కారుకూతలు కూస్తే చట్టం తన పని తాను చేసుకుంటుంది. మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు వేయాలి. అశాంతి సృష్టించాలని చూస్తే ఉక్కుపాదం మోపుతాం” అని తేల్చిచెప్పారు. ఎన్నికలను అడ్డంపెట్టుకుని పాత అలవాట్లు కొనసాగిస్తే కఠిన పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ప్రత్యర్థి పార్టీల నాయకుల హామీలపై మంత్రి ప్రశ్నల వర్షం కురిపించారు. “అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వ సహకారం ఉండాలి. అధికారంలో ఉన్న మేమే పనులు చేయగలం. అధికారం లేకుండా అభివృద్ధి చేస్తామంటూ ప్రజలను మభ్యపెట్టడం మోసమే” అని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇవ్వలేదని, ఇప్పుడు కొత్తగా నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే కొత్త రేషన్ కార్డులు, హాస్టల్ విద్యార్థులకు డైట్ చార్జీల పెంపు, పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని గుర్తుచేశారు. ప్రజలకు ప్రత్యక్షంగా లాభం చేకూరే పనులే తమ ప్రభుత్వం చేస్తోందని తెలిపారు.
ఏప్రిల్లో ఇందిరమ్మ ఇళ్లు
వచ్చే ఏప్రిల్ నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేపడతామని మంత్రి ప్రకటించారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు పట్టాలు ఇప్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఏదులాపురాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మున్నేరు వరద బాధితులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలిచిందని, వచ్చే వర్షాకాలం నాటికి రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. సభ అనంతరం వరంగల్ క్రాస్ రోడ్డు నుంచి నాయుడుపేట సర్కిల్ వరకు జరిగిన భారీ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.


