చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా!!!
పదిమంది విద్యార్థుల విద్యా బాధ్యతలను తీసుకున్న
విద్యా సంస్కర్త తాటిపల్లి శంకర్ బాబు
కాకతీయ, కొత్తగూడెం రూరల్: చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే బ్రతుకు పెద్ద సున్నరా… అని దిశా నిర్దేశం చేసిన మన విద్యా సంస్కర్తల స్ఫూర్తిని ప్రతీ విద్యార్థినీ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు గ్రహించాలని, శ్రీ సరస్వతి శిశు మందిర్ కమిటీ అధ్యక్షులు, విద్యా సంస్కర్త తాటిపల్లి శంకర్ బాబు సూచించారు. కొత్తగూడెం పట్టణం, కూలీలైన్ శ్రీ సరస్వతి శిశు మందిర్ లో జరిగిన విద్యార్థుల, తల్లిదండ్రుల, పాఠశాల కమిటీ, పుర ప్రముఖుల కమిటీ, కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. శ్రీ సరస్వతి శిశు మందిరాలు దేశవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థుల భవితవ్యానికి, దేశభక్తికి నిలయంగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. శిశు మందిరాలలో ప్రాంతీయ భాష, దేశ భాష తోపాటు సదాచారం, సంస్కృత విద్యలతో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు దేశ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలయ్యాయని ఆయన అభివర్ణించారు.
ఈ పాఠశాలలో చదివే విద్యార్థులకు తల్లిదండ్రులన్నా దైవ సన్నిధులురా!! అనే దృక్పథం, దేశభక్తి, శిశు తరగతుల నుండి అలవడుతాయన్నారు. పాఠశాలలో చదివే పదిమంది పేద విద్యార్థులకు ఆయన పాఠశాల ఫీజును స్కాలర్షిప్ గా ప్రకటించారు. పాఠశాలకు అవసరమైన, విద్యార్థులు కూర్చునే బల్లలను, టెలివిజన్ ను బహుకరించారు. దేశభక్తి ధ్యేయంగా సాగుతున్న శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు విద్యాసంస్కర్తలు స్కాలర్షిప్లు ఇచ్చుటకు ముందుకు రావాలని, విద్యాదానం మహాదానమని ఆయన పిలుపునిచ్చారు. పాఠశాలల అభివృద్ధికి విద్యాసంస్కర్తలు దోహదపడాలని ఆయన పిలుపునిచ్చారు. శిశు మందిరాల కమిటీలో సాగుతున్న ప్రతీ విద్యా సంస్కర్త పాఠశాలకు ఏదో ఒక రూపేనా సహకరించి అభివృద్ధికి దోహదపడాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. . ఈ కార్యక్రమంలో పాఠశాల కోశాధికారి ఆర్.ఎస్. రామానుజమ్ మాట్లాడుతూ పాఠశాల ప్రభుత్వ గుర్తింపు అనుమతులతో రాష్ట్ర ప్రభుత్వ విద్యా విషయ సూచనల ప్రకారం 1994 నుండి కొత్తగూడెం కూలీ లైన్ లో శ్రీ సరస్వతీ శిశుమందిర్ దినదినాభివృద్ధి చెందుతూ వర్ధిల్లుతుందని అన్నారు.
శ్రీ సరస్వతీ విద్యా పీఠం అనుబంధంగా నడిచే శ్రీ సరస్వతీ శిశుమందిరాల ఆచార్యులకు విద్యా పీఠం ప్రత్యేక శిక్షణను అందిస్తూ, దేశ భక్తిని పెంపొందించే దిశగా పాఠశాలను నిర్వహిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధుల తల్లిదండ్రులు పాఠశాల కమిటీ సభ్యులు, సమితి సభ్యులు, ఆచార్యులు, శ్రీ సరస్వతీ శిశుమందిర్ అధ్యక్షులు, విద్యా సంస్కర్త తాటిపల్లి శంకర్ బాబు దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సమితీ అధ్యక్షులు పిల్లి రాజేశ్వరరావు ప్రబంధకారిణి, సభ్యులు మోడెమ్ మోహన్ రావు, ప్రధానాచార్య జి. స్రవంతి, గణిత శాస్త్ర విభాగ ఆచార్య రజిని, ఇంగ్లీష్ విభాగ ఆచార్య కల్పన, సైన్స్ విభాగ ఆచార్య కల్పన, సామాజిక శాస్త్రం ఆచార్యులు సాహిత్య, కిండర్ గార్డెన్ విభాగ ఆచార్యులు పద్మ, నర్సరీ విభాగ ఆచార్యులు ఆఫ్రిన్ లు పాల్గొన్నారు.



