ఆ నలుగురు రాజీనామా చేస్తారా..?!
ఫిరాయించిన ఎమ్మెల్యేలపై జోరుగా ప్రచారం
కడియం, తెల్లం , దానం , పోచారంల నిర్ణయంపై విశ్లేషణలు
స్పీకర్ నోటీసుల నేపథ్యంలో గౌరవంగా తప్పుకునే అవకాశమంటూ చర్చ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు రాజీనామాలకు సిద్ధపడినట్లుగా జోరుగా చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బాన్సవాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిలు ఆ తర్వాత పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకున్న విషయం తెలిసిందే. వీరితో పాటు అరికపూడి గాంధీ, కాలె యాదయ్య, బండ్ల క్రిష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, ప్రకాశ్‌గౌడ్‌లు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్, పాడి కౌశిక్‌రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌తోపాటు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన రిట్ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపు విషయంలో బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. శాసనసభ స్పీకర్ కార్యాలయం నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పంపించారు.
ఇప్పుడేం చేద్దాం..! పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో అంతర్మథనం..!
స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేస్తారన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. స్పీకర్ నోటీసులు జారీ చేశారన్న విషయం తెలియగానే.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మీడియాతో స్పందించారు. తాను పార్టీ మారలేదని, టెక్నికల్‌గా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని తెలిపారు. ఇప్పటికీ తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. ఇక మిగతా ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయడం లేదు.ఆచితూచి వ్యవహరించాలనే యోచనలోనే ఉండటం గమనార్హం. న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత…నోటీసులపై స్పందించాలని ప్రస్తుతానికి మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు.
ఆ నలుగురు రాజీనామాకు సిద్ధమా..?!
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బాన్సవాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిలు మాత్రం స్పీకర్ నోటీసుల జారీ నేపథ్యంలో ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేస్తారన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.
పార్టీ కండువా కప్పుకోవడంతో పాటు కాంగ్రెస్ స్టాండ్ తీసుకుని క్లియర్ డైరెక్షన్‌లో ఉండటంతోవీరిపై స్పీకర్‌కు చర్యలు తీసుకోక తప్పనిసరి పరిస్థితులు నెలకొనిఉన్నాయన్న అభిప్రాయం, విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఈ నలుగురు ఎమ్మెల్యేలు గౌరవప్రదంగా రాజీనామాలు చేసే ఆలోచనతో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. చూడాలి ఏం జరుగుతుందో మరి.


