కాకతీయ, ఖమ్మం: ఈ మధ్యకాలంలో భార్యభర్తల గొడవలకు సంబంధించి ఘటనలు వార్తల్లో ఉంటున్నాయి. కొన్ని చోట్ల భార్య, భర్తను చంపితే..మరికొన్ని చోట్ల భర్త, భార్యను చంపిన ఘటనలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇవి రోటిన్ గా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ షాకింగ్ ఘటన బయటకు వచ్చింది.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్ పంచాయితీలోని జంగాల కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 51 ఏళ్ల గంగారాం తన భార్య లక్ష్మి చేతిలో తీవ్రంగా దెబ్బలు తిన్నాడు. మద్యానికి బానిసైన గంగారాంతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం లక్ష్మి, తనకు దెయ్యం పట్టిందని చెప్పి, గంగారాం నోటిలో గుడ్డలు కుక్కి, కర్రతో, ఇనుప రాడ్డుతో దాడి చేసింది. తీవ్ర గాయాలతో కేకలు వేయడంతో బంధువులు ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదుతో లక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పక్కటెముకలు విరిగిన గంగారాం ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


