ఆ శవం ఎవరిది..? ఎవరు హత్య చేశారు
మిస్టరీగా శంభునిపల్లి గోనె సంచిలో మృతదేహం కేసు
ఇప్పటికి కేసులో లీడ్ దొరకలేదా..?
పోలీసులకు సవాల్‌గా మారిన హత్య కేసు
కాకతీయ, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శంభునిపల్లి గ్రామ శివారులో గోనె సంచిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఎవరిదన్నది మిస్టరీగా మారింది. ఘటన వెలుగులోకి వచ్చిన ఐదు రోజులవుతున్నా.. ఆ మృతదేహం ఎవరిది..? ఎవరు హత్య చేశారు.. ఎందుకు హత్య చేశారన్న విషయాలపై దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదని తెలుస్తోంది. శంభునిపల్లి గ్రామ శివారులోని ఓ పత్తి చేనులో గోనె సంచిలో నవంబర్ 28న మృతదేహం ఉన్నట్లుగా గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన స్థలాన్ని సందర్శించిన జమ్మికుంట సీఐ, ఇతర సిబ్బంది భిన్న కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లా కేంద్రాలకు వెళ్లే మార్గాలు కలిసి ఉన్న చోట ఈ మృతదేహం లభ్యమవడంతో.. ఎక్కడో హత్య చేసి.. మృతదేహాన్ని మార్గమధ్యలో పడేసినట్లుగా పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. మృతదేహంపై తీవ్రమైన గాయాలు ఉండటం, కాళ్లకు తాళ్లు కట్టేసి ఉండటాన్ని బట్టి చూస్తే పక్కా ప్రణాళికతోనే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. వ్యక్తి చెవికి పోగు ఉంది. ప్రాథమిక ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఇప్పటి వరకు ఎలాంటి లీడ్ దొరకలేదని విశ్వసనీయంగా తెలుస్తోంది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సైతం ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకుంటున్న సరైన లీడ్ సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తుండటం గమనార్హం.


