- ప్రమాదం జరిగితే బాధ్యలెవరు..?
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
కాకతీయ, జూలూరుపాడు : మండలంలోని చింతలతండా, లైన్ తండా గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రహదారి మృత్యు కూపంగా మారింది. ముఖ్యంగా నడిరోడ్డుపై ఏర్పడిన భారీ గొయ్యి కారణంగా నిత్యం ప్రమాదాలు పొంచి ఉన్నాయని, వాహనాలు బోల్తా పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీంతో భారీ గొయ్యి లో స్థానికులు కొన్ని చెట్ల కొమ్మలను, బస్తా సంచులు ప్రమాద సూచిక బోర్డులాగా పెట్టారు. ఈ దుస్థితితో అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంత వల్ల ప్రయాణికులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి భారీ గుంతను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.


