ఇదెక్కడి న్యాయం…?
ప్రాణం పోతే పట్టించుకోరా..
కళాశాల డైరెక్టర్ అయితే గొప్పేంటి
న్యాయం కోరుతూ మృతదేహంతో బంధువుల ఆందోళన
కాకతీయ, కొత్తగూడెం రూరల్: విచక్షణ రహితంగా కారు నడిపి ఓ మనిషి ప్రాణం తీసిన కొత్తగూడెంలోని ప్రముఖ కళాశాల డైరెక్టర్ ను తక్షణమే అరెస్టు చేసి న్యాయం చేయాలని మంగళవారం కొత్తగూడెం బస్టాండ్ సమీపంలో ఉన్న కళాశాల ఎదుట మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీకి చెందిన దోమల సంగయ్య(48) సోమవారం ఉదయం చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ కాలనీ వద్ద కాలినడకన రోడ్డుపైకి వస్తున్నాడు. అదే ప్రాంతం నుంచి కొత్తగూడెంలోని ప్రియదర్శిని కళాశాలకు చెందిన డైరెక్టర్ చలపతిరావు రోడ్డుపైకి వస్తూ కారుతో ఢీకొట్టాడు. ప్రమాదానికి గురైన వ్యక్తి తీవ్ర రక్తస్రావం కావడంతో కళాశాల డైరెక్టర్ తన కారులో వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అప్పటికి సదరు వ్యక్తి మృతి చెందాడని డాక్టర్ ధ్రువీకరించడంతో వెంటనే కళాశాల డైరెక్టర్ మృతదేహాన్ని అక్కడే వదిలేసి హుటాహుటిన చుంచుపల్లి పోలీస్ స్టేషన్ వెళ్లి కారును అక్కడ పార్కు చేసి వెళ్ళిపోయాడు. సంగయ్య మరణ వార్త విన్న ఆయన కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ మృతదేహాన్ని ఆయన స్వగృహమైన రామాంజనేయ కాలనీకి తరలించే క్రమంలో డైరెక్టర్ పని చేస్తున్న కళాశాల వద్దకు వచ్చి మృతదేహంతో దిగారు. తక్షణమే ప్రమాదానికి కారణమైన డైరెక్టర్ను అరెస్టు చేసి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం సంఘటన జరిగినప్పటికీ మరుసటి రోజున మంగళవారం వరకు పోలీస్ శాఖ స్పందించకుండా అతనిపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. కళాశాల డైరెక్టర్ అయితే ఏంటి మనుషుల ప్రాణాలు తీస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. డైరెక్టర్ కారు నడిపే సమయంలో ఆ కారులో సిపిఐ నాయకుడు ప్రయాణిస్తున్నాడని కనీసం ఆయన కూడా కనికరించలేదని వాపోయారు. ఆందోళన చేపడుతున్న సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఎంతటి సముదాయించినప్పటికీ తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. ఒకవైపు ఎన్నికల హడావుడిలో ఉన్న పోలీస్ శాఖ సంఘటన స్థలానికి చేరుకొని బాధితురాలికి తక్షణమే న్యాయం చేస్తామని ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్టు చేస్తామని చెప్పి సముదాయించారు. దీంతో మృతుడి కుమార్తె బోరున విలిపిస్తూ తన తండ్రి ఒక బట్టల షాపులో గుమస్తాగా పనిచేస్తూ మమ్మల్ని సాకుతున్నాడని రోడ్డు ప్రమాదంలో కుటుంబంలోని పెద్దదిక్కును కోల్పోయామని తక్షణమే న్యాయం చేయాలని అక్కడున్న ప్రజలకు చేతులెత్తి మొక్కుతుంది. చివరికి పోలీస్ శాఖ తీసుకోనున్న చర్యలకు ఏ విధమైన న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సిందే.



