మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..?
నిర్ణయాధికారాలు ఎవరివి..?
ముస్లిం మహిళలు మీ ద్వంద్వ వైఖరిని గుర్తించారు
ముందు మీ పార్టీలో మహిళలకు చోటు ఇవ్వండి
మహిళను పార్టీ అధ్యక్షురాలిగా నియమించండి
ముస్లిం మహిళను ప్రధానిని చేయాలనే కల తర్వాత కనండి
ఏఐఎంఐఎం లోపాలను ఎత్తి చూపిన కేంద్ర హోం సహాయకశాఖ మంత్రి బండి సంజయ్
ట్విట్టర్‌లో పోస్టు వైరల్..!
కాకతీయ, హైదరాబాద్ : దేశానికి బుర్కా వేసుకున్న మహిళను ప్రధాని చేయాలనే కలలు కనే ముందు, ముందుగా ఏఐఎంఐఎం పార్టీలోనే ఒక మహిళను అధ్యక్షురాలిగా నియమించాలని కేంద్ర హోం సహాయకశాఖ మంత్రి బండి సంజయ్ హితవు పలికారు. మహిళా సాధికారతపై మజ్లిస్ నేతల ఉపన్యాసాలు వాస్తవ పరిస్థితిని దాచలేవని విమర్శించారు. ఏఐఎంఐఎం పార్టీ ఇప్పటివరకు ఎంతమంది ముస్లిం మహిళలకు ఎమ్మెల్యేలు లేదా ఎంపీలుగా టికెట్లు ఇచ్చిందో స్పష్టంగా చెప్పాలని ప్రశ్నించారు. పార్టీలో నిర్ణయాలు తీసుకునే కీలక పదవుల్లో ఒక్క మహిళైనా ఉందా అని నిలదీశారు. ఏఐఎంఐఎం పార్టీని ఉద్దేశించి ఆదివారం బండి సంజయ్ ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. మహిళా హక్కుల గురించి మజ్లిస్ నేతలు బహిరంగంగా మాట్లాడుతున్నా, పార్టీలో మాత్రం మహిళలకు ప్రాతినిధ్యం లేని వాస్తవాన్ని దాచలేరని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. మహిళలు తమ హక్కుల కోసం మాట్లాడితే మజ్లిస్ నేతల నుంచే బెదిరింపులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. ఒక జర్నలిస్ట్ ఓవైసీ ఇంటికి వెళ్లినప్పుడు అక్కడి మహిళలు భోజనం వడ్డించినందుకు కృతజ్ఞతలు చెప్పడం కూడా వారి “వ్యవస్థకు” విరుద్ధమని చెప్పడం మజ్లిస్ ఆలోచనలకు నిదర్శనమని విమర్శించారు.
పాతబస్తీలో బీజేపీ మహిళా పోరాటం
2018లో బీజేపీ పాతబస్తీలో షహజాదీ సయీద్‌ను అభ్యర్థిగా నిలబెట్టిందని గుర్తు చేశారు. ఆ సమయంలో ఆమెకు తీవ్ర బెదిరింపులు వచ్చాయని, అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదని తెలిపారు. ఈరోజు ఆమె జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలిగా ఉన్నారంటే, బీజేపీ మహిళా నాయకత్వాన్ని ఎలా తీర్చిదిద్దుతుందో అర్థమవుతుందన్నారు. బీజేపీకి మైనారిటీ మోర్చా ఉందని, మహిళా నాయకులను తయారు చేసే స్పష్టమైన విధానం ఉందని చెప్పారు. ముస్లిం మహిళలు ఏఐఎంఐఎం ద్వంద్వ వైఖరిని ఇప్పుడు స్పష్టంగా గుర్తిస్తున్నారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. చాలామంది ముస్లిం మహిళలు ప్రధాని నరేంద్ర మోదీని తమ అభ్యున్నతికి పనిచేసే సోదరుడిగా భావిస్తున్నారని అన్నారు. నిజమైన మహిళా సాధికారత మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాల ద్వారానే సాధ్యమైందని స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ రద్దు, ముస్లిం మహిళలకు చట్టపరమైన రక్షణ, మహిళల పేర్లపై సంక్షేమ పథకాలు, బ్యాంక్ ఖాతాలు, గ్యాస్ కనెక్షన్లు, ఇళ్లు, మరుగుదొడ్లు వంటి కార్యక్రమాలు మహిళల జీవితాల్లో గణనీయమైన మార్పు తెచ్చాయని తెలిపారు. బీజేపీ మహిళలను మతం కోణంలో కాకుండా శక్తివంతమైన పౌరులుగా చూస్తుందని అన్నారు. మరోవైపు అసదుద్దీన్ ఒవైసీ మాత్రం మహిళల సాధికారతపై మాట్లాడుతూనే, పార్టీ, ప్రజాజీవితం, ఇల్లు—అన్ని చోట్ల మహిళలపై ఆంక్షలు విధిస్తున్నారని బీజేపీ నేతలు విమర్శించారు.


