ఖమ్మం మున్సిపల్ కౌన్సిల్ తీర్మానాలకు విలువేదీ?
రెండుసార్లు సరెండర్ చేసిన అధికారికి మళ్లీ విధులా?
సీడీఎంఏ ఆదేశాలపై కార్పొరేటర్ల మండిపాటు
అధికార–ప్రతిపక్షాల ఆగ్రహం
కమిషనర్ మౌనం వెనుక మర్మమేంటి?
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరపాలక సంస్థ కౌన్సిల్ నిర్ణయాలకు విలువ ఉందా లేదా అన్న ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న ఆర్వో సుధాకర్‌పై గతంలో తీవ్ర ఆరోపణలు రావడంతో కౌన్సిల్ రెండుసార్లు తీర్మానం చేసి అతడిని సీడీఎంఏకు సరెండర్ చేసింది. అయినప్పటికీ, అదే అధికారి మళ్లీ విధుల్లోకి చేరడం నగర రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
కౌన్సిల్‌లో మేయర్‌తో పాటు సభ్యులందరి ఆమోదంతో తీసుకున్న తీర్మానాలను పక్కనపెట్టి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీడీఎంఏ ఆదేశాలు జారీ చేయడంపై అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిల్ తీర్మానాలకే విలువ లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ అర్థం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

కౌన్సిల్ తీర్మానాలే శాసనాలు కావా?
గతంలో కమిషనర్లు సందీప్ జూ, అనురాగ్ జయంతులు కౌన్సిల్ తీర్మానాలను గౌరవిస్తూ ఆర్వో సుధాకర్‌ను సీడీఎంఏకు సరెండర్ చేసిన విషయం తెలిసిందే. అలాంటప్పుడు, అదే సీడీఎంఏ అతడిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించడం వెనుక కారణాలేమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి తీర్మానం జరిగాక మళ్లీ అదే అంశం పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కమిషనర్‌దేనని కార్పొరేటర్లు పేర్కొంటున్నారు.
అవినీతి ఆరోపణలపై ఎందుకీ జాప్యం?
ఈ అధికారి నగరపాలక సంస్థలో ఏళ్ల తరబడి పనిచేస్తూ నిత్యం అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మద్యం దుకాణాల అసెస్‌మెంట్ కేటాయింపుల విషయంలో లక్షల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తినా ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు లేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై కమిషనర్ మౌనం వహించడం వెనుక అసలు కారణం ఏమిటో స్పష్టత ఇవ్వాలని అధికార, ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కౌన్సిల్ నిర్ణయాలను పట్టించుకోకుండా ఉన్నతాధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే నగరపాలక సంస్థ పరిపాలనపై ప్రజల్లో నమ్మకం దెబ్బతింటుందని కార్పొరేటర్లు హెచ్చరిస్తున్నారు.


