హామీలు ఏమయ్యాయి రేవంత్ రెడ్డి?
పైసలు లేని ప్రభుత్వానికి ఓటేస్తే గజ్వేల్‌కు నిధులెలా?
కాకతీయ, గజ్వేల్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా ప్రశ్నించారు. గజ్వేల్ నియోజకవర్గం ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. “లంకె బిందెలు దొరుకుతాయని ప్రజలు ఆశిస్తే చివరకు చేతికి చిప్ప మిగిలింది. నా దగ్గర ఐదు పైసల బిళ్ల కూడా లేదు అని సీఎం రేవంత్ రెడ్డే చెబుతున్నారు. మరి పైసలు లేని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే గజ్వేల్‌కు నిధులు ఎలా వస్తాయి?” అని ఈటల నిలదీశారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో నిధులు లేక ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు సహా అనేక హామీలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. గజ్వేల్ అభివృద్ధి కావాలంటే కేంద్రంతో కలిసి పనిచేసే ప్రభుత్వాలు అవసరమని, ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో భాగంగా 4వ వార్డు అభ్యర్థి రొట్టెల శ్రీనివాస్, 5వ వార్డు అభ్యర్థులు సల్ల శ్రీనివాస్–అన్నపూర్ణ, 6వ వార్డు అభ్యర్థులు పీర్ల శ్రీనివాస్–సిద్దేశ్వరిలను గెలిపించాలని ఈటల కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్, ఎన్నికల ఇంచార్జి ఆకుల విజయ, మున్సిపల్ అధ్యక్షుడు మనోహర్ యాదవ్, మాజీ చైర్మన్ భాస్కర్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


