ఆరు గ్యారంటీల అమలు సంగతేంటి..?
కాంగ్రెస్ 420 హామలలో అధికారంలోకి వచ్చింది
తడిచిన పంటలను షరతుల్లేకుండా కొనుగోలు చేయాలి
కాకతీయ, ఖమ్మం టౌన్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఖమ్మం పట్టణంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తొలుత ర్యాలీ పెవిలియన్ గ్రౌండ్ నుంచి వైరా రోడ్డు మీదగా జడ్పీ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్ ) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల వెంకటేశ్వర్లు సీవై పుల్లయ్య మాట్లాడుతూ ఆరు గ్యారంటీల హామీలకు తోడు 420 వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. రెండేండ్లు దాటి ముచ్చటగా మూడో ఏట ప్రవేశించే సందర్భాన డిశంబర్ 9న సంబరాలు జరుపుకోబోతున్నదని ఎద్దేవాచేశారు. అకాల వర్షాలతో పత్తి, వరి, మొక్కజొన్న, సోయా తదితర పంటలు తడిసి పోయాయి. అసలే దిగుబడి తక్కువ. పైగా పత్తిని సీసీఐ కొనుగోలు చేయడానికి రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నది. పత్తి నల్లబడిందని, తేమ శాతం ఎక్కువ వుందని కొనుగోలు నిరాకరిస్తున్నారు. ఇదంతా రైతును మార్కెట్లో తక్కువగా అమ్ముకునేలా చేయడానికే, ఆ తరువాత సీసీఐ అధికారులు దళారులతో కుమ్మక్కై భాగం పంచుకుంటారు. సీసీఐ కొనుగోళ్ళు ఆలస్యంగా ఆరంభించడమే అన్యాయం. పైగా కేంద్ర ప్రభుత్వం అమెరికా ఆంక్షలకు తలొగ్గి మన మార్కెట్లోకి అమెరికా పత్తి దిగుమతులపై వున్న 11 శాతం సుంకాలను డిసెంబర్ వరకు ఎత్తి వేసింది. మన పత్తికి రేటు రాకుండా చేసి, అమెరికా పత్తిని దిగుమతి చేసుకోవడం రైతాంగానికి ద్రోహం చేయడమే. అలానే తడిసిన అన్ని రకాల పంటలను కొనుగోలు చేయా లని ఆర్ గ్యారంటీల అమలుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు .
ఇంకా ఈ ధర్నాలో సీపీఐ ఎమ్ ఎల్ మాస్ లైన్ నాయకులు జి రామయ్య ,ఆవుల అశోక్ ,బందెల వెంకయ్య ,ఆర్ శివలింగం, మలీదు నాగేశ్వరరావు సిహెచ్ శిరోమణి, ఝాన్సీ, శోభా ,కమ్మ కోమటి నాగేశ్వరరావు, ఎస్.కె లాల్మియా, ఆజాద్, కుర్ర ఎంకన్న, లక్ష్మణ్, రాకేష్ ,తేజ నాయక్ , అప్పారావు, శరత్ తదితరులు పాల్గొన్నారు .


