ఏళ్ల తరబడి పాతుకుపోతే సహించం
ఆడిట్ చేసి ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించాలి
ఖమ్మం జిల్లా . టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ధ్వజం
టీడబ్ల్యూజేఎఫ్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులకు సన్మానం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ వ్యవహారాలపై ఇకపై నిర్లక్ష్యాన్ని సహించబోమని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకత్వం స్పష్టం చేసింది. టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా దగ్గుపాటి మాధవ్, కార్యదర్శిగా నూకల రామచంద్ర మూర్తి (కాకతీయ దినపత్రిక ఖమ్మం స్టాఫర్) సోమవారం జిల్లా బాధ్యుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష–కార్యదర్శులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఖదీర్, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం ప్రెస్ క్లబ్‌కు గొప్ప చరిత్ర ఉందని, ఇది ఒక్క వర్గానికో, ఒక్క యూనియన్‌కో చెందినది కాదని, ప్రతి జర్నలిస్టుకూ హక్కు ఉన్న ఉమ్మడి వేదిక అని స్పష్టం చేశారు. ప్రెస్ క్లబ్ నిర్వహణలో నెలకొన్న అవకతవకలపై ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.
సామాన్యుల గొంతుకగా ప్రెస్ క్లబ్ మారాలి
నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షుడు దగ్గుపాటి మాధవ్, కార్యదర్శి నూకల రామచంద్ర మూర్తి మాట్లాడుతూ… తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా నాయకత్వ సూచనల మేరకు ప్రెస్ క్లబ్ నిర్వహణలో కొత్త మార్పులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఇకపై ప్రెస్ క్లబ్ సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు, విద్యార్థి సంఘాలు తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకునే వేదికగా మారేలా కృషి చేస్తామన్నారు. టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ముఖ్య నాయకులతో పాటు ప్రజా సంఘాలతో సమన్వయం చేసుకుని ప్రెస్ క్లబ్ అభివృద్ధికి పాటుపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ ఉపాధ్యక్షుడు దువ్వా సాగర్, ట్రెజరర్ తేనె వెంకటేశ్వర్లు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష–కార్యదర్శులు ఆవుల శ్రీను, రవికిరణ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మధుశ్రీ, జిల్లా వీడియో గ్రాఫర్ల అధ్యక్ష–కార్యదర్శులు ఫయాజ్, గణేష్, డెస్క్ జర్నలిస్టు అధ్యక్షుడు అక్కిరెడ్డి, నగర అధ్యక్ష–కార్యదర్శులు రాజేంద్ర మూర్తి, వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు నాగలక్ష్మి, వి6 గోపి, హర్షద్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.


