కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి జిల్లా కేంద్రంలో లంబాడీ జేఏసి ఆధ్వర్యంలో భూక్యా రమేష్, లావుడ్య ప్రసాద్ నాయక్ అధ్యక్షతన వేలాదిగా తరలి వచ్చిన గిరిజనులు (లంబాడీ) తో లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యాడ్ నుండి పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ సెంటర్ వరకు లంబాడీ ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహించారు. వేలాదిగా తరిలి వచ్చి శాంతియుత ర్యాలీలో పాల్గొన్న లంబాడీ బిడ్డలకు జిల్లా లంబాడీ జేఏసి నాయకులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, గుగులోత్ రాజేష్ నాయక్, డాక్టర్ శంకర్ నాయక్ లు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్బంగా ర్యాలీని ఉద్దేశించి వారు మాట్లాడుతూ గతంలో కొందరు స్వార్థపూరితంగా లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని వేసిన పిటిషన్ పై గౌరవ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ సోయం బాపూరావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
1970 సంవత్సరంలో ఇందిరాగాంధీ ఎస్టీ జాబితాలో బంజారాలను చేర్చారని, బంజారాలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే బంజారాలన్నారు. గౌరవ హైకోర్టు లంబాడీలపై వేసిన పిటిషన్ కొట్టి వేసినప్పటికీ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాపూరావు సుప్రీంకోర్టులో బంజారాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని పిటిషన్ వేయడాన్ని తీవ్రంగా విమర్శిస్తు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని, కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ కారణంగా బీసీలకు రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్ హామీ అమలైందని తమకు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలన్నారు.
లేకుంటే రాబోవు స్థానిక సంస్థల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 లక్షల మంది బంజారాలు కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేస్తామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో జరగనున్న పునర్విభజన నేపథ్యంలో బంజారా ఆదివాసి.. ఎస్టీలకు నష్టం జరిగే అవకాశం ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎస్టీ ప్రజానీకం తరుపున ఎస్టీ ప్రజా ప్రతినిధులు తమ గొంతు వినిపించాలని, ఎస్టీలకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉన్న గిరిజన తెగల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవడం సరికాదని హెచ్చరించారు.
స్వలాభం కోసమే తెల్లం, సోయం గిరిజన తెగల మధ్య చిచ్చు పెడుతున్నారని తెలుసుకొని, ఇద్దరిని ఆదివాసీ సమాజం నమ్మడం లేదని, వీళ్ళ వెనక ఉండి నడిపించే అదృశ్య శక్తులు ఎవరో లంబాడీ సమాజానికి తెలుసని వారిని వెంటాడి మరీ ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని హెచ్చరించారు. అన్నదమ్ముల ఉండి ఎవరి వాటా వాళ్ళు పంచుకుందాం రండని భద్రాద్రి కొత్తగూడెం లంబాడీ జేఏసి నాయకులు పిలుపునిచ్చారు.


