ఏదులాపురం మున్సిపాలిటీని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఏదులాపురం మున్సిపాలిటీలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం ఏదులాపురం మున్సిపాలిటీ లో ఏదులాపురం చెరువు నాలాపై రూ. 20.25 లక్షలతో చేపట్టనున్న కల్వర్ట్ నిర్మాణ పనులకు, సాయి గణేష్ నగర్ లోని ఎన్.ఎస్.పి. కాల్వపై రూ. 15.70 లక్షలతో చేపట్టనున్న కల్వర్ట్, పోలేపల్లి డబుల్ బెడ్ రూం కాలనీలో రూ. 25 లక్షలతో చేపట్టనున్న సిసి రోడ్డు, డ్రైయిన్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేడు ఏదులాపురం మున్సిపాలిటీలో 2 కల్వర్ట్ లు, డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీలో అవసరమైన సిసి రోడ్డు, డ్రైయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.
అభివృద్ధి పనుల్లో వెనకడుగు లేదు
ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎటువంటి వెనుకడుగు వేయకుండా చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో వందకు వంద శాతం ప్రతి రోడ్డును సిమెంట్ రోడ్డుగా మారుస్తామని, దాంతో పాటు డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేసి ఏదులాపురంను రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా తయారు చేస్తామని తెలిపారు. శాశ్వతంగా త్రాగునీటి తో సహా స్థానికంగా కావలసిన మౌళిక వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పేదలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చేందుకు ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పాలేరు నియోజకవర్గంలో మరిన్ని కార్యక్రమాలు చేయడంతో పాటుగా ఏదులాపురం మున్సిపాలిటీలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణలోనే రోల్ మోడల్ మున్సిపాలిటీగా చేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి పోలేపల్లి డబల్ బెడ్ రూంల 56 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఇ యాకుబ్, ఖమ్మం ఆర్డీవో జి. నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాధ బాబు, ఎదులాపురం మునిసిపల్ కమీషనర్ శ్రీనివాస రెడ్డి, ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రాంప్రసాద్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


