టౌన్ ప్లానింగ్‌లో అవినీతికి చెక్ పెడుతాం
లంచాలు తీసుకుంటే క్రిమినల్ కేసులు
అక్రమ నిర్మాణాలపై కొరడా
నిజాయితీగా పనిచేసేవారికి రక్షణ
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
దళారుల వ్యవస్థ నిర్మూలనకు ఆదేశాలు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి, అక్రమాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ‘‘ఇప్పటిదాకా ఒక లెక్క… ఇకపై మరో లెక్క’’ అంటూ ఇంటి నిర్మాణ అనుమతుల పేరుతో ప్రజలను వేధించడం, బ్రోకర్లు, ఏజెన్సీల ద్వారా లంచాలు వసూలు చేయడం సహించబోమని తేల్చిచెప్పారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టడం ఆపాలని, ప్రజలకు సులభంగా అనుమతులు అందేలా వ్యవస్థను మార్చాలని సూచించారు. ఇకపై లంచాలు తీసుకుంటే బదిలీతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అదే సమయంలో నిజాయితీగా పనిచేసే అధికారులకు పూర్తి రక్షణ ఉంటుందని హామీ ఇచ్చారు. రాజకీయ ఒత్తిళ్లు ఉండవని స్పష్టం చేశారు.
అవినీతికి తావు లేదు… ఉండలేనివారు వెళ్లొచ్చు
పట్టణ ప్రణాళిక విభాగంపై ఉన్న అవినీతి ముద్రను పూర్తిగా తొలగించాలన్నారు. అవినీతి కొనసాగించే అధికారులు ఇక్కడ కొనసాగలేరని, అలాంటివారు స్వచ్ఛందంగా బదిలీపై వెళ్లొచ్చని కఠిన హెచ్చరిక జారీ చేశారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరించి నిబంధనలు స్పష్టంగా వివరించి వేగంగా సేవలు అందించాలని ఆదేశించారు. కార్యాలయాల చుట్టూ ప్రజలను తిరగదోపడం ఇక సహించబోమన్నారు.
దళారుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని స్పష్టం చేశారు. ప్రజలకు నేరుగా సేవలు అందేలా ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. ఇంటి నిర్మాణ అనుమతులను పారదర్శకంగా, త్వరితగతిన మంజూరు చేసే విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
అక్రమ నిర్మాణాలపై కొరడా
అనుమతి లేకుండా జరుగుతున్న నిర్మాణాలను ప్రారంభ దశలోనే అడ్డుకోవాలని మంత్రి ఆదేశించారు. కార్పొరేషన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను గుర్తించి వారం రోజుల్లో నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు. నోటీసులు పట్టించుకోకపోతే కూల్చివేత చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల విషయంలో నిర్లక్ష్యం సహించబోమన్నారు.అధికారుల పనితీరుపై నిరంతర నిఘా ఉంటుందని, ప్రతి చర్యపై పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. పట్టణ ప్రణాళిక, ఆదాయ, పారిశుధ్య విభాగాలపై మూడు రోజుల్లో అవగాహన సదస్సు నిర్వహించాలని ఆదేశించారు. అక్రమ వసూళ్లకు పూర్తిగా చెక్ పెట్టాలని స్పష్టం చేశారు.నగరంలో ఇంటి నిర్మాణానికి సులభంగా అనుమతులు లభించే విధానాన్ని అమలు చేసి కరీంనగర్‌ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఎన్నికల హామీ మేరకు ప్రక్షాళన ప్రారంభించామని పేర్కొంటూ నెలరోజుల్లో స్పష్టమైన మార్పు కనిపించాల్సిందేనని అధికారులను హెచ్చరించారు.


