- సింగరేణి చైర్మన్ ను కోరిన ఎమ్మెల్యే కూనంనేని
కాకతీయ, కొత్తగూడెం రూరల్: కొత్తగూడెం పట్టణం, పరిసర ప్రాంతాల అభివృద్ధికి సింగరేణి సంస్థ ద్వారా సహకరించాలని కొత్తగూడెం శాసనసభ సభ్యుడు కూనంనేని సాంబశివరావు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాంను కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన సంస్థ ప్రధాన కార్యాలయంలో బలరాంను స్వయంగా కలిసి పలు ప్రతిపాదనలు ముందుంచారు. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన ఆర్టీసీ బస్టాండ్ నూతన భవనాలకు సంస్థ ద్వారా నిధులు మంజూరు చేయాలని, సిఎస్ఆర్ ఫండ్ సాధ్యమైనంత త్వరగా మంజూరు చేయాలని కోరామని కూనంనేని తెలిపారు.
పోస్టాఫీసు సెంటర్ నుంచి డిఎస్పి ఆఫీసు మీదుగా హేమచంద్రాపురం వరకు వున్న రోడ్డు సింగరేణి సంస్థ భారీ వాహనాల రాకపోకలవల్ల శిథిలమైందని, దీన్ని సింగరేణి యాజమాన్యమే పుననిర్మించాలని కోరామన్నారు. సింగరేణి కార్మిక వాడలు, ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు కావల్సిన మౌలికవసతుల కల్పనకు యాజమాన్యం చొరవ చూపాలన్నారు. రుద్రంపూర్, రామవరం తదితర ప్రాంతాల్లో మాజీ కార్మికులు నివసిస్తున్న క్వార్టర్లను వారికే స్వాధీనం చేసి విద్యుత్, త్రాగునీటి వసతి కల్పించాలని కోరామన్నారు. కూనంనేని వెంట సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు ఎస్కే సాబీర్ పాషా, వంగ వెంకట్, రమణమూర్తి తదితరులున్నారు.


