- యూనియన్ ఎన్నికల్లో ఏనాడు తలదూర్చలేదు
- యూనియన్ ఎన్నికలు పార్టీలకు అతీతంగా ఉండాలి
- కొందరు పోటీదారులు తన మద్దతు మాకేనంటూ ప్రచారం పట్ల మంత్రి తుమ్మల ఆగ్రహం
- ప్రచారం ఖండించిన మంత్రి తుమ్మల
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ యూనియన్ ఎన్నికల్లో తన పేరు చెప్పి కొందరు పోటీదారులు ప్రచారం చేయడాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఖండించారు. ఏ యూనియన్ ఎన్నికల్లో తన నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు జోక్యం చేసుకోలేదనీ, కార్మిక సంఘాలు ట్రేడర్స్ యూనియన్ ఎన్నికలు పార్టీలకు అతీతంగా సభ్యులకు ఇష్టమొచ్చిన వారిని ఎన్నుకునే ప్రజాస్వామ్యం ఉండాలని మంత్రి తుమ్మల అభిప్రాయం వ్యక్తం చేశారు. నవంబర్ 16 న జరగనున్న ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ఎవ్వరికి బహిరంగ మద్దతు తెలపలేదని, కొందరు పోటీదారులు తన పేరుతో ప్రచారం చేయడం పట్ల మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్యానెల్ ఎన్నికైనా వర్తక వ్యాపార సంస్థలు వ్యాపారులు ఖమ్మం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని,ఎవ్వరు యూనియన్ లో ఉన్నా అరాచకం బెదిరింపులు లేకుండా ఖమ్మం లో ప్రశాంతంగా వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి తుమ్మల తెలిపారు.
ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ఏ వ్యాపారి కూడా తన పేరుతో ప్రచారం చేసి ఎవ్వరిని ప్రలోభ పెట్టొద్దని అలాంటి వారిని గుర్తించి చర్యలు విషయంలో రాజీ పడేది లేదని మంత్రి తుమ్మల హెచ్చరించారు.


