- మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
- లోతట్టు ప్రాంతాల వాసులను అలెర్ట్ చేసిన అధికారులు
కాకతీయ, భద్రాచలం : ఎగువున్న ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరుకు భారీగా నీరు చేరడంతో గోదావరి ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43.00 అడుగులకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం 9,32,228 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న క్రమంలో కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముంపు ప్రాంత గ్రామాల ప్రజలను అలర్ట్ చేస్తున్నారు.
గోదావరి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు రక్షణ చర్యలకు సహకరించాలని, అధికారుల సూచనలను ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ కోరారు. అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ నెంబర్లకు సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.


