వక్ఫ్ బోర్డు భూములను కాపాడాలి
ఆక్రమణలు తొలగించి ఉపాధి కల్పించాలి
బీసీసీ జామా మసీదు అధ్యక్షులు మస్తాన్
కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న వక్ఫ్ బోర్డు భూములకు సరైన రక్షణ లేకుండా పోయిందని, వాటిని కాపాడేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని బీసీసీ జామా మసీదు అధ్యక్షులు మస్తాన్, ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు మహమ్మద్ రియాజ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం వారు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. వక్ఫ్ భూముల ఆక్రమణలపై ఇప్పటికే అధికారుల దృష్టికి, ఇటీవల మంత్రి అజారుద్దీన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు ఇటీవల ప్రభుత్వ అధికారులు కొన్ని ప్రాంతాల్లో ఆక్రమిత వక్ఫ్ భూముల వివరాలు సేకరించినట్లు పేర్కొన్నారు. ఆక్రమణకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకొని, వాటిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ ముస్లిం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ముస్లింలలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, దీనికి పరిష్కారంగా వక్ఫ్ బోర్డు ఖాళీ భూములను సద్వినియోగం చేయాలని సూచించారు.


