- బోయలను చిన్నచూపు చూస్తున్న ప్రభుత్వం
- వెనుకబడిన వర్గాలపై రేవంత్ నిర్లక్ష్యం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : మానవ సమాజానికి సత్యం, ధర్మం, న్యాయం, నైతికత మార్గాలను చూపిన మహర్షి వాల్మీకి బోధనలు అందరికీ మార్గదర్శకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి వారసత్వానికి సంబంధించిన వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఎమ్మార్వో ఆఫీసుల్లో కనీసం కుల ధృవపత్రాలు కూడా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాల్మీకి సమాజం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అన్యాయమని మండిపడ్డారు. ఇప్పటికైనా వాల్మీకి బోయల సంక్షేమం, సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.
వసతులు కల్పించాలి..
రాష్ట్ర ప్రభుత్వం పదేపదే బీసీలకు, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటోందని, కానీ వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాలు, గురుకుల విద్యాసంస్థలు తీవ్రమైన ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. ప్రస్తుతం దాదాపు 6 లక్షల 70 వేల మంది విద్యార్థులు గురుకులాల విద్యాలయాల్లో చదువుతున్నారని, కానీ వారికీ తినడానికి సరైన భోజనం, సురక్షిత భవనాలు లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు, గురుకులాలు సొంత భవనాల్లేక అద్దె భవనాల్లో నడుస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో యజమానులు భవనాలకు తాళాలు వేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాల విద్యార్థుల కోసం గురుకులాల్లో అన్ని వసతులు కల్పించేందుకు తగిన నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


