భారత దశను మార్చిన వాజ్పేయి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి
ఘనంగా ముగిసిన అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ముగింపు ఉత్సవాలు శుక్రవారం కొత్తగూడెం ఐఎంఏ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జీవీకే మనోహర్ రావు, కుంజా ధర్మ, జంపన సీతారామరాజు, జిల్లా కార్యదర్శి నోముల రమేష్తో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న 28 మండలాల అధ్యక్షులు, రాష్ట్ర–జిల్లా–మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజకీయాలకు ఆదర్శంగా వాజ్పేయి
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ దశదిశను మార్చిన మహోన్నత నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అని కొనియాడారు. నిజాయితీకి నిలువుటద్దంగా నిలిచిన వాజ్పేయి, రాజకీయాలు ఎలా చేయాలి.. ఎలా చేయకూడదో రాబోయే తరాలకు చూపించిన మహానీయుడన్నారు. ఒక్క ఓటుతో ప్రభుత్వం నిలుపుకోవచ్చన్నా, ఎలాంటి మద్దతు తీసుకోకుండా ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి ప్రజా తీర్పు కోసం ప్రజల్లోకి వెళ్లిన అరుదైన నాయకుడిగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా కుంజా ధర్మ మాట్లాడుతూ గిరిజన మహిళ ద్రౌపది ముర్మును దేశ రాష్ట్రపతిగా చేసిన భారతీయ జనతా పార్టీకి అభినందనలు తెలిపారు. రాష్ట్ర నాయకులు జీవీకే మనోహర్ రావు మాట్లాడుతూ దొంగ ఓట్ల పేరుతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేశారు. కార్యకర్తలు బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, బూత్ అధ్యక్షులు, కమిటీలు సమర్థంగా పనిచేయాల్సిన బాధ్యత మండల కమిటీలదేనని సూచించారు. అనంతరం వార్డు మెంబర్గా గెలిచిన వారిని, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


