రెండు రోజుల్లో యూరియా అందుబాటులోకి
17 సబ్ సెంటర్ల ద్వారా పంపిణీ
కల్లూరుగూడెం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
ఎలాంటి కొరత లేదు..రైతులు ఆందోళన చెందవద్దు
: వ్యవసాయ శాఖ ఏడీ సతీష్
కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండలంలోని రైతులకు అవసరమైన యూరియాను రెండు రోజుల్లో సబ్ సెంటర్ల ద్వారా అందుబాటులోకి తీసుకొస్తామని కూసుమంచి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు సతీష్ తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద కల్లూరుగూడెం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబ్ సెంటర్లో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ… రైతుల అవసరాలకు అనుగుణంగానే యూరియా సరఫరా జరుగుతుందని స్పష్టం చేశారు. యూరియా కొరతపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.
17 సబ్ సెంటర్లకు సరఫరా
మండలంలోని వివిధ వ్యవసాయ సొసైటీల పరిధిలో ఏర్పాటు చేసిన 17 సబ్ సెంటర్లకు యూరియా చేరనుందని, రెండు రోజుల్లో రైతులకు పంపిణీ చేస్తామని వెల్లడించారు. రైతులు సబ్ సెంటర్ల ద్వారా యూరియాను పొందుతూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి, ఏఈఓ జానీ బాబా, కూసుమంచి గ్రామ పాలన అధికారి, కల్లూరుగూడెం సొసైటీ సీఈవో శేఖర్, సొసైటీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


