ప్రజా అసరాలకు అనుగుణంగా నగరాభివృద్ధి
పనుల నాణ్యత విషయంలో రాజీలేదు
డివిజన్‌కు కోటి రూపాయల కేటాయింపు
మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
ఖమ్మం 14వ డివిజన్‌లో రూ.2.25 కోట్ల పనులకు శంకుస్థాపన
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ప్రజల అవసరాలకు అనుగుణంగా ఖమ్మం నగర పరిధిలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం నగరంలోని 14వ డివిజన్ గోపాలపురంలో రూ.2 కోట్ల 25 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ, సీసీ రోడ్లు, డ్రెయిన్‌ల అభివృద్ధి పనులకు గురువారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నగర ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు భూకబ్జాదారులు, రౌడీలకు ఖమ్మం నగరంలో చోటు ఉండదని స్పష్టం చేశారు. అక్రమ కేసులు, భూకబ్జాలు, మట్కా, గంజాయి వంటి దందాలకు ప్రస్తుత పాలనలో తావులేదన్నారు. గంజాయి వల్ల యువత, చిన్నారులు భవిష్యత్తు నాశనమవుతోందని ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి.. ఈ దుష్ప్రవర్తనను అరికట్టేందుకు ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
నగరాభివృద్ధికి భారీ నిధులు
ఖమ్మం నగర అభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసిందని, జనవరిలో మరో రూ.50 కోట్లు మంజూరు చేసేలా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. చేపట్టే ప్రతి పని నాణ్యతతో, వేగంగా పూర్తయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. గోపాలపురంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసిన మంత్రి.. నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే భవిష్యత్‌లో నిధులు మంజూరు కాదని హెచ్చరించారు. పది కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడేలా పనులు ఉండాలన్నారు. ఖమ్మం నగర జనాభా ఐదు లక్షలకు చేరిందని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీరు, డ్రెయిన్‌లు, రహదారులు, పేదలకు ఇళ్ల వంటి మౌలిక వసతులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలకతీతంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నాయకులు పనిచేయాలని సూచించారు.
డివిజన్‌కు కోటి రూపాయల కేటాయింపు
ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ.. 14వ డివిజన్‌లో రూ.2.25 కోట్లతో సీసీ డ్రెయిన్‌లు (ఒక కిలోమీటర్), రోడ్లు (రెండు కిలోమీటర్లు) నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల మంజూరైన రూ.50 కోట్ల గ్రాంట్‌లో 14వ డివిజన్‌కు రూ.కోటి కేటాయించామని, సంబంధిత పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. నగరవ్యాప్తంగా ఫుట్‌పాత్‌లు, పార్కులు, కేబుల్ బ్రిడ్జి, ఖమ్మం ఖిల్లాకు రోప్‌వే, సింథటిక్ ట్రాక్, ప్రధాన రహదారుల విస్తరణ వంటి పనులు జరుగుతున్నాయని తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హనుమంతరావు, కార్పొరేటర్లు, ఆర్డీఓ నరసింహారావు, ఇరిగేషన్ ఈఈ అనన్య, అర్బన్ తహసీల్దార్ సైదులు తదితరులు పాల్గొన్నారు.


