జాతరకు ఊహించని భక్తజనం
మణుగూరు మినీ మేడారానికి పోటెత్తిన భక్తులు
తోగ్గుడెం సమ్మక్క–సారక్క ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిట
కాకతీయ,మణుగూరు : మణుగూరు మండలం తోగ్గుడెం గ్రామం లో నిర్వహిస్తున్న మినీ మేడారం సమ్మక్క–సారక్క జాతరకు ఊహించని స్థాయిలో భక్తులు తరలివచ్చారు.అధికారులు,ఆలయ కమిటీ అంచనాలకు మించి భక్తుల సంఖ్య పెరగడంతో జాతర ప్రాంగణం పూర్తిగా కిటకిటలాడింది.ఆలయ ప్రాంగణంలో ఇసుక వేస్తే రాలనంతగా భక్తుల సందడి కనిపించింది. సమ్మక్క–సారక్క తల్లులను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.తోగ్గుడెం గ్రామం మొత్తం జాతర వాతావరణంతో సందడిగా మారింది.భక్తుల రాకతో ఆలయ పరిసర ప్రాంతాల్లో రద్దీ నెలకొనగా,పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు కట్టుదిట్టంగా చేపట్టారు.

ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నిర్వహించారు.మణుగూరు సిఐ నాగబాబు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు,అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి,ఎస్సై నగేష్ కుమార్,ఎస్సై శ్రావణ్ కుమార్ విధుల్లో పాల్గొన్నారు.పోలీసు అధికారులు ఆలయ ప్రాంగణం,పరిసర ప్రాంతాలను పరిశీలిస్తూ భక్తులకు సూచనలు ఇచ్చారు.జాతర ప్రశాంతంగా కొనసాగేందుకు అధికారులు,ఆలయ కమిటీ సమన్వయంతో పనిచేశారు.భక్తులు అమ్మవార్లను భక్తిశ్రద్ధలతో దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.మణుగూరు మినీ మేడారం జాతర భక్తుల కిక్కిరిసిన హాజరుతో ఘనంగా కొనసాగుతోంది.



