కదంతొక్కిన నిరుద్యోగ యువత
ఖమ్మం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ
మద్దతు పలికిన బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు..
నిరుద్యోగులను వాడుకొని వదలేసిందని ధ్వజం
రేవంత్‌రెడ్డి ఉద్యోగం త్వరలో ఊడటం ఖాయమంటూ ఆగ్రహం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఖమ్మంలో నిరుద్యోగులు కదంతొక్కారు. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు.
మొన్న మానుకోటలో, ఈ రోజు ఖమ్మంలో నిరుద్యోగ యువత రోడ్డెక్కిన తీరు చూస్తుంటే రేవంత్ రెడ్డి ఉద్యోగం త్వరలో ఓడిపోవడం ఖాయమనిపించిందన్నారు. మొదటిసారి తెలంగాణ ఉద్యమం కూడా ఇదే ఉమ్మడి ఖమ్మంలోనే పురుడుపోసుకుందని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ జరిగిందని దేశమంతా ప్రచారం చేస్తున్నారు. కానీ, అసలైన ఓట్ చోరీ తెలంగాణలో జరిగిందని, అదే నిరుద్యోగుల, యువత ఓట్ల చోరీ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 10 ఏళ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ ఎక్కడ అధికారం పోతుందేమో అన్న భయంతో నోటికొచ్చిన హామీ ఇచ్చిందన్నారు. కానీ, తమకు ఉద్యోగాలు రాగానే నిరుద్యోగులను మరిచిపోయారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రచార సామగ్రిని ఎలా వాడుకొని వదిలేస్తారో అలాగే నిరుద్యోగులను సైతం ప్రచారానికి బస్సు యాత్రలకు వాడుకొని వదిలేశారని దుయ్యబట్టారు. గ్రూప్ -1 ఉద్యోగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఉద్యోగాల చోరీ కూడా బట్టబయలు అయిందని ఎద్దేవాచేశారు. ఇప్పుడు ఆ ఓట్ల చోరీని కప్పిపుచ్చుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సొమ్ముతో నిరుద్యోగులను ఓడించడానికి లాయర్లకు కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు యూత్ డిక్లరేషన్ ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, కానిస్టేబుల్,గురుకుల పోస్టులకు, గ్రూప్స్ ఉద్యోగ నోటిఫికేషన్ డీఎస్సీ, డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. జీవో 46 రద్దు చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, విద్యార్ధినిలకు ఉచిత స్కూటీలు అందజేయాలని రాకేష్‌రెడ్డి డిమాండ్ చేశారు.


