జగిత్యాల ప్రేమ వివాహం దాడి ఘటనలో ట్విస్ట్
మొదటి భార్య, మూడేళ్ల కూతురు ఉన్నప్పటికీ మరో పెళ్లి
సఖీ కేంద్రంలో కౌన్సెలింగ్ సమయంలో ఘర్షణ
యువతి కుటుంబసభ్యుల దాడితో గాయపడిన అనిల్
పోలీసుల అదుపులోకి వచ్చిన ఘటన
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : జగిత్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న సఖీ కేంద్రంలో జరిగిన ప్రేమ వివాహం దాడి ఘటనలో కీలక మలుపు తిరిగింది. మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన అనిల్ ఇదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకుని, వీరికి మూడేళ్ల కూతురు ఉన్నట్లు సమాచారం. అయితే భార్యాభర్తల మధ్య కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి.
ఈ క్రమంలో కరీంనగర్ మండలానికి చెందిన మరో యువతిని ప్రేమ పేరుతో ఈనెల ఇరవై ఒకటో తేదీన అనిల్ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. విషయం యువతి కుటుంబసభ్యులకు తెలియడంతో వారు మల్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనిల్‌కు ఇప్పటికే భార్య, కూతురు ఉన్న విషయం తెలియడంతో రెండో యువతిని పోలీసులు జగిత్యాల సఖీ కేంద్రానికి తరలించారు. శుక్రవారం సాయంత్రం యువతి కుటుంబసభ్యులు, బంధువులు సఖీ కేంద్రానికి చేరుకున్నారు. కేంద్ర నిర్వాహకులు యువతికి కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా అక్కడికి వచ్చిన అనిల్‌తో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆగ్రహానికి గురైన యువతి కుటుంబసభ్యులు, బంధువులు అనిల్‌పై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన అనిల్‌ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.


