మధిరలో త్రిపక్ష పొత్తు ఖరారు
బీఆర్ఎస్–సీపీఎం–సీపీఐ అధికారిక అవగాహన
ఇరవై రెండు వార్డుల్లో అభ్యర్థుల ఖరారు
కాకతీయ, మధిర : మధిర మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ పార్టీల మధ్య అధికారిక రాజకీయ పొత్తు ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ పొత్తు కింద మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై రెండు వార్డులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్లు సమాచారం.
మూడు పార్టీల నాయకత్వాలు పరస్పర చర్చల అనంతరం సీట్ల పంపకంపై అవగాహనకు వచ్చాయని, ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయని తెలుస్తోంది. పొత్తులో భాగంగా ఎక్కువ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు, కొన్ని వార్డుల్లో సీపీఎం, సీపీఐ అభ్యర్థులు బరిలో నిలవనున్నారు.
అధికారికంగా ఖరారైన అభ్యర్థుల వివరాల ప్రకారం – మొదటి వార్డులో దోర్నాల ఎలిసిబెత్ (బీఆర్ఎస్), రెండో వార్డులో ధీరావత్ మాధవి (బీఆర్ఎస్), మూడో వార్డులో లక్మాల వెంకటేశ్వర్లు (బీఆర్ఎస్) పోటీ చేయనున్నారు. ఏడో వార్డులో ఓట్ల కొండలరావు సీపీఐ తరఫున, తొమ్మిదో వార్డులో కస్తూరి సీపీఎం అభ్యర్థిగా, పదిహేనో వార్డులో శ్రీపాద కోటేశ్వరరావు సీపీఎం అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు.
పదహారో వార్డులో మల్లాది హనుమంతరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నప్పటికీ, ఆయనకు బీఆర్ఎస్ అధికారిక మద్దతు ఉంటుందని ప్రకటించారు. మిగతా వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
ఈ త్రిపక్ష పొత్తు మధిర మున్సిపాలిటీ రాజకీయాల్లో కీలక మలుపుగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారిక ప్రకటనతో ఎన్నికల సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉందని స్థానిక రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.


