- రెండు రోజుల్లో తాత్కాలిక రహదారి ఏర్పాటు చేస్తామన్న ఎంపీడీవో
కాకతీయ, పినపాక: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట సిపిఎం, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు నిరసన తెలిపారు. సుందరయ్య నగర్ గ్రామస్తులు తమ గ్రామ రహదారిపై హామీ ఇచ్చేవరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న మాట్లాడుతూ సుందరయ్య నగర్ గ్రామంలో రహదారి నిర్మిస్తామని హామీలు ఇవ్వడమే తప్ప ప్రభుత్వంగాని, ప్రజాప్రతినిధులుగాని, అధికారులు గాని ఆ హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యుడు మడివి రమేష్ మాట్లాడుతూ అనారోగ్యం పాలైతే సుందరయ్య నగర్ గ్రామంలో ఇంకా డోలీలు కట్టాల్సి వస్తుందని, ఇంకెంతకాలం తమకు ఈ డోలిమోతలు అని ప్రశ్నించారు.
కనీసం పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి బడి సౌకర్యం కూడా లేదన్నారు. ఆదివాసి గిరిజన సంఘ మండల అధ్యక్షుడు దుబ్బా గోవర్ధన్ మాట్లాడుతూ సుందరయ్య నగర్ తో పాటు పినపాక మండలంలో వివిధ గిరిజన గ్రామాలకు రహదారి లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 108 వాహనం గ్రామాలకు రాలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ ముట్టడిలో సుందరయ్య నగర్ గ్రామస్తులు సుమారు 100 మంది, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. సుందరయ్య నగర్ రహదారికి రెండు రోజుల్లో తాత్కాలిక మరమ్మత్తులు చేస్తామని ఎంపీడీవో సునీల్ కుమార్ హామీ ఇచ్చారు. ఎన్నికల విధుల్లో ఉండటం వల్ల ఒక నెలపాటు ఆలస్యమైందన్నారు. తహసిల్దార్, సీఐ, అటవీశాఖ అధికారులతో సైతం సంప్రదిస్తామని తెలిపారు.


