- ఐటీడీఏ ఏడీఎంహెచ్వో డాక్టర్ సైదులు
కాకతీయ, మణుగూరు : ఏజెన్సీ గ్రామాలలో నివసిస్తున్న ఐదు నెలలు నిండిన గర్భిణీలకు తప్పనిసరిగా టిప్పా స్కానింగ్ చేయాలని ఐటీడీఏ ఎడిఎంహెచ్వో డాక్టర్ సైదులు మణుగూరు ఏరియా ఆసుపత్రి డాక్టర్లకు సూచించారు. బుధవారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఆదేశాల మేరకు మణుగూరు మండలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అనంతరం ఏరియా ఆసుపత్రి కి వచ్చే రోగులకు అందిస్తున్న వైద్య తీరును, టిప్ప స్కానింగ్ పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన డాక్టర్లతో మాట్లాడుతూ వర్షాకాలం అయినందున ఏరియా ఆసుపత్రి పరిధిలోని మండలాలలోని గిరిజన గ్రామాల్లో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇతర వైరల్ ఫీవర్స్ విజృంభించే అవకాశం ఉంది. మండలాలలో పని చేసే మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించి విధులు నిర్వహించాలన్నారు.
రోగులకు సరైన వైద్య చికిత్సలు అందించి తగినన్ని మందులు అందించాలన్నారు. పీహెచ్సీ పరిధిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలన్నారు. పీహెచ్సీ ఏరియా ఆసుపత్రిలో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకొని మలేరియా, డెంగ్యూ మరణాలు సంభవించకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ చైతన్య, డిపిఎంఓ పాయం శ్రీనివాస్, ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ సునీల్, హెచ్ఈఓ గొంది వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


