నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శెట్టిపల్లి సత్తిరెడ్డి పిలుపు
కాకతీయ, కొమురవెల్లి : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శెట్టిపల్లి సత్తిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కొమురవెల్లి మండలంలోని అయినాపూర్, పోసానిపల్లి, రామ్‌సాగర్, కొమురవెల్లి గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేసి సమ్మెకు మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు, నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ–2020)ను వెంటనే రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ వ్యవస్థను కాపాడాలని, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఆశా వర్కర్లకు రూ.18,000 ఫిక్స్‌డ్ వేతనం అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.1500 పారితోషికాన్ని వెంటనే అమలు చేయాలని తెలిపారు. 2021 జూలై నుంచి డిసెంబర్ వరకు పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ ఏరియర్స్ చెల్లించాలని, పల్స్ పోలియో బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ ఉద్యోగులను బదిలీ చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కారోబార్లకు ప్రత్యేక హోదా కల్పించాలని కోరారు. విద్యుత్ సవరణ బిల్లు, విత్తన సవరణ బిల్లు, ఎల్‌ఐసీలో విదేశీ పెట్టుబడుల అనుమతిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, అఖిలభారత ఫెడరేషన్ల పిలుపుమేరకు జరిగే ఈ సమ్మెలో కార్మికులు భారీగా పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిలు, కిషన్, రోడ్డ నరసింహులు, అరుణ, మంజుల, పుష్ప, కలబాలవ్వ తదితరులు పాల్గొన్నారు.


