చేర్యాల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రలోభాలకు పాల్పడితే కఠిన చర్యలు: సీపీ హెచ్చరిక
పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీలో బుధవారం జరగనున్న ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాళ్ తెలిపారు. 12 వార్డులకు నిర్వహించనున్న పోలింగ్ కోసం సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు, వెబ్‌కాస్టింగ్ తదితర అంశాలపై మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. పోలింగ్ సిబ్బంది మంగళవారం సాయంత్రం నాటికి కేంద్రాలకు చేరుకోవాలని, ఎన్నికలు ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రంగా స్ట్రాంగ్ రూములకు తరలించేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరగనున్న కేంద్రాన్ని ముందుగానే పోలీస్ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు చేపట్టరాదని సీపీ హెచ్చరించారు. డబ్బులు, వస్తువుల పంపిణీ, సోషల్ మీడియా ద్వారా అక్రమ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 3 రూట్ అధికారులు, 3 జోనల్ అధికారులు, 6 రిటర్నింగ్ అధికారులను నియమించారు. భద్రత కోసం 2 డీఎస్పీలు, 5 సీఐలు, 8 ఎస్సైలు సహా మొత్తం 130 మంది పోలీసు సిబ్బందిని మోహరించినట్లు అధికారులు తెలిపారు.


