సేవా పథంలో తుమ్మల అభిమానులు
తుమ్మల యుగంధర్ జన్మదిన సందర్భంగా విద్యార్థులకు అల్పాహార వితరణ
మంత్రి స్వగ్రామం గండుగులపల్లిలో ఘనంగా వేడుకలు
22 రోజుల పాటు 10వ తరగతి విద్యార్ధులకు అల్పాహారం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి:తమ అభిమాన నాయకుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. మంత్రి స్వగ్రామమైన గండుగులపల్లిలో బుధవారం అభిమానుల ఆధ్వర్యంలో విద్యార్థులకు అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహించారు.
పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో, గండుగులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు అభిమానులు పౌష్టికరమైన అల్పాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ.. తుమ్మల యుగంధర్ ప్రజాసేవలో తన తండ్రి అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కేవలం ఒక్క రోజుతో ముగించకుండా, వరుసగా 22 రోజుల పాటు ఈ అల్పాహార వితరణ కొనసాగిస్తామని వారు సంకల్పించారు.ఈ సందర్భంగా అభిమానులు పాఠశాల ఆవరణలో కేక్ కట్ చేసి యుగంధర్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొయ్యల అచ్యుతరావు, పైడి వెంకటేశ్వరరావు,యర్రా వసంతరావు,కె .వి సత్యనారాయణ కాసాని నాగప్రసాద్, పైడి సాయి , గండుగులపల్లి గ్రామ పెద్దలు, తుమ్మల యువసేన సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తమ నాయకుడిపై ఉన్న ప్రేమాభిమానాలను ఇలా సేవా కార్యక్రమాల రూపంలో చాటుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.


