ముగ్గురు మంత్రుల జిల్లా… ఆసుపత్రి అభివృద్ధి ఎక్కడ?
భద్రాద్రికి 600 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తప్పనిసరి
డాక్టర్లు సేవలే… ప్రభుత్వ సౌకర్యాలు శూన్యం
కొత్తగూడెం జీజీహెచ్‌లో వాస్తవాలు బయటపెట్టిన కల్వకుంట్ల కవిత
కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నా ప్రభుత్వ వైద్య వ్యవస్థ అభివృద్ధి మాత్రం శూన్యమని మండిపడ్డారు. జిల్లా కేంద్రానికి కనీసం 600 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవసరమని, ఇందుకు స్థానిక మంత్రులు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా గురువారం కొత్తగూడెం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని డాక్టర్లు, వైద్య సిబ్బంది, రోగులతో మాట్లాడి అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. బెడ్లు, మందులు, మౌలిక వసతుల కొరత ఉన్నప్పటికీ సిబ్బంది అంకితభావంతో సేవలందిస్తున్నారని ప్రశంసించారు.
పాత ఆసుపత్రి విస్తరణేనా?
కొత్తగూడెం లాంటి కీలక ప్రాంతంలో పాత ఆసుపత్రిని విస్తరిస్తూ పోవడం తప్ప పూర్తి స్థాయి వైద్య సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని కవిత విమర్శించారు. కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ వంటి కీలక విభాగాలకు రోగులు వరంగల్ ఎంజీఎంకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇది జిల్లాలో వైద్య వసతుల దుస్థితికి నిదర్శనమన్నారు. పీడియాట్రిక్ విభాగంలో తొమ్మిది మంది డాక్టర్లు అవసరమైతే ప్రస్తుతం ఇద్దరే ఉన్నారని తెలిపారు. ఎక్స్‌రే, ఎంఆర్ఐ స్కాన్ వంటి పరీక్షలకు సరైన స్థలం లేకపోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అత్యవసరంగా వైద్య సిబ్బంది నియామకాలు, ఆధునిక పరికరాలు ఏర్పాటు చేయాలని కోరారు.
ఉద్యోగ భద్రత లేని సేవలు
కేర్‌టేకర్లు, సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బంది, క్లీనర్లు కీలకంగా పనిచేస్తున్నా వారికి ఉద్యోగ భద్రత, హెల్త్ పాలసీ కూడా లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన వారిని ప్రభుత్వం విస్మరించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోందని హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు మంత్రులు రాజకీయాలకు అతీతంగా ఆలోచించి కొత్తగూడెంలో 600 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


