- విశ్వాసాల ముసుగులో సీజే గవాయ్ పై దాడి దుర్మార్గం
- ఆ ఘటనను సుమోటోగా తీసుకోకపోవడం బాధాకరం
- నవంబర్ 1న హైదరాబాదులో భారీ నిరసన ర్యాలీ
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
కాకతీయ, ఖమ్మం టౌన్: దేశ రాజ్యాంగాన్ని గౌరవించిన వారు, చట్టాలకు విలువనివ్వని వారిని దేశద్రోహులుగా పరిగణించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులపై ఇప్పటికీ వివక్ష, అంటరానితనం, దాడులు, హత్యలు, హత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. దేశ అత్యున్నత వ్యవస్థ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దళితుడైన గవాయ్ మీదనే బూటుతో దాడి జరిగిందని తెలిపారు. ఈ సంఘటన జరిగి మూడు వారాలు గడుస్తున్నా పోలీసులు మౌనంగా ఉండడం, న్యాయవ్యవస్థ సుమోటోగా కేసు తీసుకోకపోవడం దారుణమని అన్నారు. మానవ హక్కుల కమిషన్ స్పందించలేదన్నారు. అంటే ఈ దేశంలో దళితులకు ఇప్పటికీ రక్షణ లేదని స్పష్టంగా రుజువు అవుతుందన్నారు.
ధర్మం, విశ్వాసాల ముసుగులో రాజ్యాంగాన్ని లెక్కచేయకుండా, చట్టాలకు విలువనివ్వకుండా దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని గౌరవించని వారు, చట్టాలకు విలువనివ్వని వారు దేశద్రోహులవుతారని స్పష్టం చేశారు. గవాయ్ స్థానంలో వేరే జస్టిస్ ఉంటే దాడి జరిగేదా అని ప్రశ్నించారు.? గతంలో జార్ఖండ్ లో న్యాయమూర్తిని అవమానించాడని ఐదుగురు జడ్జీల బృందం అర్ధగంటలో న్యాయవాదిపై కేసు నమోదు చేశారని గుర్తుచేశారు. అలాగే పోలీసు కస్టడీలో ఉన్న రౌడీషీటర్ రియాజ్ ఎలా చనిపోతాడని మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసిందని గుర్తు చేశారు. చీఫ్ జస్టిస్ మీద సుప్రీంకోర్టులో దాడి జరిగితే సుమోటోగా కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. గవాయిపై జరిగిన దాడిని, దళితులందరిపై జరిగిన దాడిగా పరిగణిస్తూ.. దళితుల ఆత్మగౌరాన్ని కాపాడుకోవడానికి, న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడానికి, రాజ్యాంగ పరిరక్షణకు నవంబర్ 1న ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాదులో నిరసన ర్యాలీ జరుగుతుందని తెలిపారు. కుల, మత, రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరు కదలి రావాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో ఖమ్మం జిల్లా ఇంచార్జి కందికట్ల విజయ్ మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తూరుగంటి అంజయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి సునీల్ మాదిగ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు చిలక నాగరాజు, గొల్లమందల ముత్తారావు, తోళ్ళ సురేష్, తూరుగంటి రాము, బాకి శ్రీను, కనకం జనార్ధన్, చింతిరాల నాగభూషణం, కొలికపోగు ప్రభు, సూరేపల్లి నాగేశ్వరరావు, తోళ్ళ వెంకన్న, పొట్టపింజర బాలస్వామి, పార్షపు ఇనుక, పగిడిపల్లి రవీందర్, మాదాసు వెంకన్న, లంజపల్లి భద్రం, పడిశాల నాగేశ్వరరావు, కుక్కల లక్ష్మయ్య, చిర్రా ఉపేందర్, స్వామి, చాగంటి నరసింహారావు, రాజు, నాగేశ్వర్రావు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.


