కాకతీయ, టీటీడీ: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ తిరుమల తిరుపతి దేవాస్తానం ప్రకటించింది. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని తెలిపింది. సెప్టెంబర్ 23న అంకురార్పణతో వేడకలు ప్రారంభం అవుతాయని తెలిపింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో వాహన సేవలు ఉంటాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహనం, రథోత్సవం, చక్రస్నానం వంటి ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల ముందు భాగంగా, ఆలయంలో సెప్టెంబర్ 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ప్రత్యేకంగా నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి రోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.
ప్రధాన కార్యక్రమాలు:
24 సెప్టెంబర్ 2025: సాయంత్రం 5.43 నుంచి 6.15 వరకు మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది. రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.
25 సెప్టెంబర్ 2025: ఉదయం చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి హంస వాహనం.
26 సెప్టెంబర్ 2025: ఉదయం సింహ వాహనం, మధ్యాహ్నం స్నపనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం.
27 సెప్టెంబర్ 2025: ఉదయం కల్పవృక్ష వాహనం, మధ్యాహ్నం స్నపనం, రాత్రి సర్వభూపాల వాహనం.
28 సెప్టెంబర్ 2025: ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం 6.30 నుంచి అద్భుతమైన గరుడ వాహనం.
29 సెప్టెంబర్ 2025: ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి గజ వాహనం.
30 సెప్టెంబర్ 2025: ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం.
1 అక్టోబర్ 2025: ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం ఊరేగింపు ఉంటుంది.
2 అక్టోబర్ 2025: ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.
ఈ తొమ్మిది రోజుల ఉత్సవాల్లో శ్రీవారిని భక్తులు నిత్యం వివిధ వాహనాలపై దర్శించుకోవచ్చు. తిరుమల బ్రహ్మోత్సవాలు ఎప్పటిలాగే ఈసారి కూడా భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే అద్భుత వేడుకలుగా నిలిచే అవకాశం ఉంది.


