- కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
- సమస్యాత్మక గ్రామాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు
ఖమ్మం, కాకతీయ ప్రతినిధి: జిల్లాలో నిర్వహించిన మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా శాంతియుతంగా కొనసాగుతోందన్నారు. పెనుబల్లి మండలం చింతగూడెం, ఏరుగట్ల, లంకపల్లి, అలాగే కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామ పంచాయతీల్లోని పోలింగ్ కేంద్రాలను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించి, ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతలకు విఘాతం కలగకుండా సమస్యాత్మక గ్రామాల్లో ముందస్తు జాగ్రత్తలతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద గుంపులు ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో సమస్య సృష్టించే అవకాశమున్న వ్యక్తులను ముందుగానే బైండోవర్ చేసినట్లు వెల్లడించారు.
పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్యూలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తుతో పోలీస్ అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్పష్టం చేశారు.


